ఈ బంధం.. మరింత బలోపేతం

భారత్‌-యూఏఈ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీన్ని మరిన్ని రంగాలకూ విస్తరించాలని తీర్మానించాయి. మంగళవారం ఇక్కడికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యూఏఈ కొత్త అధ్యక్షుడు, అబుధాబి పాలకుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో భేటీ అయ్యారు.

Published : 29 Jun 2022 04:24 IST

భారత్‌, యూఏఈ నిర్ణయం

అబుధాబిలో ప్రధాని మోదీ పర్యటన

అబుధాబి: భారత్‌-యూఏఈ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీన్ని మరిన్ని రంగాలకూ విస్తరించాలని తీర్మానించాయి. మంగళవారం ఇక్కడికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యూఏఈ కొత్త అధ్యక్షుడు, అబుధాబి పాలకుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో భేటీ అయ్యారు.

జర్మనీలో జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ స్వదేశానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో అబుధాబిలో కొద్దిసేపు ఆగారు. ఇటీవల మరణించిన యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌కు నివాళులర్పించడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. ఆయనకు స్వాగతం పలికేందుకు.. కొత్త పాలకుడు షేక్‌ మహ్మద్‌, రాజకుటుంబంలోని సీనియర్‌ సభ్యులు ప్రొటోకాల్‌ పక్కనపెట్టి స్వయంగా అబుధాబి ప్రెసిడెన్షియల్‌ విమానాశ్రయానికి తరలివచ్చారు. దీనికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నా సోదరుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి, స్వాగతం పలకడం నా మనసును హత్తుకుంది. ఆయనకు కృతజ్ఞతలు’’ అని అరబిక్‌, ఇంగ్లిష్‌ భాషల్లో ట్వీట్‌ చేశారు. దివంగత పాలకుడి మృతి పట్ల రాచకుటుంబానికి సంతాపం తెలిపారు. ‘‘షేక్‌ ఖలీఫా అత్యంత గౌరవనీయ రాజనీతిజ్ఞుడు. ప్రజల కోసం నిర్విరామంగా పనిచేసిన దార్శనికుడు. ఆయన హయాంలో భారత్‌-యూఏఈ సంబంధాలు బాగా వృద్ధి చెందాయి’’ అని పేర్కొన్నారు. షేక్‌ ఖలీఫా గత నెల 13న కన్నుమూశారు. నాడు భారత్‌ ఒకరోజు సంతాపదినాన్ని పాటించింది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గత నెలలో యూఏఈ సందర్శించి షేక్‌ ఖలీఫాకు నివాళులర్పించారు.

యూఏఈ అధ్యక్షుడిగా, అబుధాబి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన షేక్‌ మహ్మద్‌కు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహార భద్రత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య బంధం వృద్ధి చెందుతోందని సంతృప్తి వ్యక్తంచేశారు. యూఏఈలో ఉంటున్న 35 లక్షల మంది భారతీయులను బాగా చూసుకుంటున్నారంటూ షేక్‌ మహ్మద్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ సందర్శించాలని కూడా ఆయనను ఆహ్వానించారు. ఆ తర్వాత మోదీ స్వదేశానికి తిరుగుప్రయాణమయ్యారు. ఆయనకు విమానాశ్రయంలో షేక్‌ మహ్మద్‌ వీడ్కోలు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని