Al-Jawahiri: అమెరికా రహస్య ఆయుధం!

అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీని అమెరికా హతమార్చిన తీరు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచ చరిత్రలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదుల్లో ఒకడైన అతణ్ని పేలుళ్లేవీ లేకుండా.. ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకూ

Updated : 03 Aug 2022 08:50 IST

అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీని అమెరికా హతమార్చిన తీరు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచ చరిత్రలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదుల్లో ఒకడైన అతణ్ని పేలుళ్లేవీ లేకుండా.. ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకూ హాని జరగకుండా చాకచక్యంగా చంపేశారు. ఇందుకోసం ఉపయోగించిన క్షిపణి- ‘హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌’. అమెరికా రహస్య ఆయుధంగా దాన్ని చెప్పుకోవచ్చు.

లేజర్‌ గైడెడ్‌ క్షిపణులు

అమెరికా అమ్ములపొదిలో ‘ఏజీఎం-114 హెల్‌ఫైర్‌’ అనే లేజర్‌ గైడెడ్‌ క్షిపణులు ఉన్నాయి. వీటిని గగనతలం నుంచి భూతలంపైకి ప్రయోగిస్తారు. ధ్వని కంటే తక్కువ వేగంతో అవి ప్రయాణిస్తాయి. వార్‌హెడ్‌, మార్గనిర్దేశక వ్యవస్థ, భౌతిక వేరియేషన్ల ప్రాతిపదికన ఏజీఎం-114 హెల్‌ఫైర్‌లో అనేక ఉప రకాలు ఉన్నాయి. వీటిలో ‘హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌’ది ప్రత్యేక స్థానం. పరిసరాల్లో పెద్దగా నష్టం జరగకుండా.. లక్షిత వ్యక్తులను మాత్రమే హతమార్చేందుకు ఈ రకం క్షిపణులను ఒబామా హయాంలో అభివృద్ధి చేశారు. కరడుగట్టిన ఉగ్ర నాయకులను ఒంటరిగా హతమార్చేందుకు అమెరికా తరచూ వీటినే వినియోగిస్తోంది.

నాడు అల్‌-మస్రిపై..

తమ వద్ద హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌ ఉన్నట్లు అమెరికా అధికారులు ఏనాడూ బహిరంగంగా ప్రకటించలేదు. 2017 మార్చిలో ఈ క్షిపణి తొలిసారిగా కనిపించింది. ఆ ఏడాది మార్చిలో సిరియాలో అల్‌ఖైదా సీనియర్‌ నేత అబూ అల్‌ఖయిర్‌ అల్‌ మస్రి ప్రయాణిస్తున్న కారుపై దాన్ని ప్రయోగించారు. దాని తీవ్రతకు కారు పైభాగానికి పెద్ద రంధ్రం పడింది. అల్‌ మస్రి సహా లోపలున్నవారంతా నుజ్జునుజ్జయ్యారు. కానీ కారు ముందుభాగం, వెనకభాగం ఏమాత్రం దెబ్బతినలేదు. నిజానికి అప్పటివరకు హెల్‌ఫైర్‌ క్షిపణులు అంటే శక్తిమంతమైన పేలుళ్లకు కారణమయ్యేవాటిగానే భావించేవారు. వాటివల్ల పరిసర ప్రాంతాల్లోనూ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందని అనుకునేవారు. అల్‌ మస్రి మరణోదంతం తర్వాత హెల్‌ఫైర్‌లోని విభిన్న రకాల గురించి ప్రపంచానికి తెలిసింది.

ఇంకా ఎప్పుడు ప్రయోగించారంటే..

* యెమెన్‌లో 17 మంది అమెరికా నావికుల మరణానికి కారణమైన జమాల్‌ అల్‌ బడావీ అనే ముష్కరుణ్ని 2019 జనవరిలో ఈ క్షిపణితోనే చంపేశారు.

* సిరియాలో అల్‌ఖైదాతో అనుబంధమున్న ఓ ఉగ్ర శిక్షకుడిని హతమార్చేందుకు 2020లో ఉపయోగించారు.

* 2020లో ఇరాన్‌ సైనిక ప్రముఖుడు జనరల్‌ ఖాసిం సొలెమనీని చంపేందుకూ హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌నే అమెరికా వినియోగించినట్లు వార్తలొచ్చాయి.


బ్లేడ్లే ఛిద్రం చేస్తాయ్‌

హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌ క్షిపణిలో వార్‌హెడ్‌ ఏమీ ఉండదు. కాబట్టి దానివల్ల పేలుడు సంభవించదు. క్షిపణి ప్రధాన భాగానికి అనుసంధానం చేసి ఆరు పదునైన కత్తుల్లాంటి బ్లేడ్లు ఉంటాయి. లక్ష్యానికి అత్యంత సమీపంగా వెళ్లగానే ఈ బ్లేడ్లను క్షిపణి విడుదల చేస్తుంది. అవి లక్షిత వ్యక్తి శరీరాన్ని ఛిద్రం చేయడం ద్వారా చంపేస్తాయి.


హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌

పొడవు: దాదాపు 5 అడుగులు

బరువు: 45 కిలోలు

వేటి నుంచి ప్రయోగించొచ్చు?: డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాలు, హమ్వీ వాహనాలు

* హెల్‌ఫైర్‌ క్షిపణుల పరిధి.. ఆయా ఉప రకాలను బట్టి 500 మీటర్ల నుంచి 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

* హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌ను నింజా బాంబ్‌, ప్లయింగ్‌ జిన్సు అని కూడా పిలుస్తుంటారు.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని