అమెరికా కాదంటేనే రష్యాకు దగ్గరయ్యాం: జైశంకర్‌

అమెరికా నుంచి ఆయుధ సేకరణకు గతంలోనే భారత్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనీ, అందువల్లనే రష్యా ఆయుధాలపై ఆధారపడక తప్పలేదని భారత విదేశీ వ్యవహారాల

Published : 27 Sep 2022 05:53 IST

వాషింగ్టన్‌: అమెరికా నుంచి ఆయుధ సేకరణకు గతంలోనే భారత్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనీ, అందువల్లనే రష్యా ఆయుధాలపై ఆధారపడక తప్పలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. భారతీయ అమెరికన్‌ సంఘాలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. 1965 నుంచి 40 ఏళ్లపాటు అమెరికా ఆయుధాల్లో కనీసం ఒక్కటైనా భారత్‌కు అందలేదనీ, ఆ సమయంలోనే భారత్‌-సోవియట్‌ యూనియన్‌ మధ్య రక్షణ బంధం బలపడిందని వివరించారు. సమైక్య, పటిష్ఠ, స్వతంత్ర, సంపన్న భారతం తమ ప్రయోజనాలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని అమెరికా గుర్తించలేదన్నారు. తన తండ్రి, తాత భారత రక్షణ శాఖలో పనిచేసేవారు కాబట్టి ఈ రంగంలో అమెరికా సహకారం కోసం భారత్‌ ఎంతగా ప్రయత్నించిందో బాగా తెలుసన్నారు. భారత్‌-అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం కుదిరినప్పటినుంచి పరిస్థితిలో మార్పు వస్తోందని జైశంకర్‌ తెలిపారు. ఈ బంధం మున్ముందు మరింత బలపడుతుందన్నారు.

అమెరికా పత్రికల తీరుపై జైశంకర్‌ విమర్శ

అమెరికాలో పత్రికలు భారతదేశం పట్ల ప్రతికూల భావనలతో వార్తలు, వ్యాఖ్యలు వండివారుస్తున్నాయని జైశంకర్‌ విమర్శించారు. వాషింగ్టన్‌ పోస్ట్‌తో సహా పలు పత్రికలు భారత్‌పై పక్షపాతపూరిత వార్తలు ప్రచురిస్తున్నాయన్నారు. భారత్‌ స్వతంత్రంగా వ్యవహరించడం అమెరికా సమాచార సాధనాలకు నచ్చడం లేదని చెప్పారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే, ప్రాణ నష్టంకన్నా ఇంటర్నెట్‌పై నిషేధమే గొప్ప వార్త అన్నట్లు చర్చ రేపుతారని వ్యాఖ్యానించారు. వక్రీకరణలను భారతీయ అమెరికన్లు సాగనివ్వకూడదనీ, వాస్తవాలను ప్రపంచానికి తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని