మనిద్దరం భారత బిడ్డలమే

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాలు తమ భారతీయ మూలాలను ఒకే వేదికపై గుర్తుచేసుకున్నారు.

Published : 05 Oct 2022 06:13 IST

కమలా హారిస్‌తో ప్రియాంకా చోప్రా

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాలు తమ భారతీయ మూలాలను ఒకే వేదికపై గుర్తుచేసుకున్నారు. డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీకి చెందిన విమెన్స్‌ లీడర్‌షిప్‌ ఫోరం... హారిస్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు లాస్‌ ఏంజెలెస్‌లో స్థిరపడిన ప్రియాంక చోప్రాను ఆహ్వానించింది. డెమోక్రాట్‌ మద్దతుదారులతో కిక్కిరిసిన హాలులో ఇంటర్వ్యూను ప్రారంభిస్తూ- ‘‘ఒక విధంగా మనిద్దరం భారతీయ కుమార్తెలం’’ అని ప్రియాంకా చోప్రా అన్నారు. ప్రపంచానికి అమెరికా ఒక ఆశగా, శ్వాసగా, మెరుగైన ఎంపికగా ఉందన్నారు. 20 ఏళ్లు సినిమాల్లో పనిచేసిన తర్వాత ఈ ఏడాది మాత్రమే పురుష నటులతో సమానంగా తనకు పారితోషికం అందినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అమెరికా గాయకుడు నిక్‌ జోనస్‌ను వివాహమాడిన చోప్రాకు ఈ ఏడాది జనవరిలో అమ్మాయి జన్మించింది. హారిస్‌ మాట్లాడుతూ- ‘‘మనం ఇప్పుడు అస్థిరమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. ఉపాధ్యక్షురాలిగా ప్రపంచమంతటా పర్యటిస్తున్నా. వంద మంది ప్రపంచ స్థాయి నేతలతో నేరుగా, ఫోన్‌లో సంభాషించాను. ఎక్కడికక్కడ సంఘర్షణలు నెలకొన్నాయి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంతో ఉన్న ఉక్రెయిన్‌ ఇప్పుడు రష్యా దాడితో చితికిపోయింది’’ అన్నారు. వాతావరణ మార్పులు, సమానత్వం, అమెరికాలో సమాన ఓటు హక్కు మంజూరు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని