ప్రసూతి వార్డుపై రష్యా రాకెట్‌ దాడి

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియాలో ప్రసూతి వార్డుపై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ ఘటనలో రెండు రోజుల వయసున్న పసికందు ప్రాణాలు కోల్పోయాడు. శిశువు తల్లిని, వైద్యుడిని భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి.

Published : 24 Nov 2022 04:13 IST

రెండు రోజుల పసికందు మృతి
శిథిలాల నుంచి తల్లిని రక్షించిన ఉక్రెయిన్‌ బలగాలు

కీవ్‌: దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియాలో ప్రసూతి వార్డుపై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ ఘటనలో రెండు రోజుల వయసున్న పసికందు ప్రాణాలు కోల్పోయాడు. శిశువు తల్లిని, వైద్యుడిని భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడిలో రెండంతస్తుల ప్రసూతి వార్డు మొత్తం ధ్వంసమైనట్లు తెలిపాయి. దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. జపోరిజియా ప్రాంతంలో 11 పట్టణాలు, గ్రామాల్లో ఫిరంగుల మోత మోగింది. ఓ అణు విద్యుత్‌ కర్మాగారం సమీప ప్రాంతాలపైకి దాదాపు 30 క్షిపణుల్ని రష్యా ప్రయోగించింది. నివాస భవనాలు, విద్యుత్తు పంపిణీ లైన్లు దెబ్బతిన్నాయి.

మొబైల్‌ ఫోన్ల వెలుగులోనే వైద్యం

రష్యా దాడుల తీవ్రతతో ఉక్రెయిన్‌లో పలుచోట్ల అంధకారం నెలకొంది. శీతాకాలం ప్రారంభమైన తరుణంలో ఈ పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారింది. ఖేర్సన్‌లోనైతే వైద్యులు చీకట్లోనో, మొబైల్‌ ఫోన్ల వెలుగులోనో పనిచేయాల్సి వస్తోంది. రోగులను శస్త్రచికిత్సలకు తరలించాలన్నా లిఫ్టులు పనిచేయట్లేదు. కొన్ని ఆసుపత్రుల్లో కీలకమైన వైద్య పరికరాలు పనిచేయడం లేదు. సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్న రష్యావారిని జంతువులతో కూడా పోల్చలేమని ఓ బాలుడి తల్లి ఆవేదనతో వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌లో జన హననం: పోప్‌ ఫ్రాన్సిస్‌

రష్యా దండయాత్ర వల్ల ప్రస్తుతం ఉక్రెయిన్‌ వాసులు పడుతున్న కష్టాలను సోవియట్‌ యూనియన్‌లో స్టాలిన్‌ హయాంలో జరిగిన జనహననంతో పోప్‌ ఫ్రాన్సిస్‌ పోల్చారు. బుధవారం ప్రజలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని