Ukraine Crisis: జీ7కు భారత్‌ను ఆహ్వానిస్తారా..?

ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన జీ7 గ్రూపు సదస్సుకు భారత్‌కు ఈ సారి ఆహ్వానం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

Published : 13 Apr 2022 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన జీ7 గ్రూపు సదస్సుకు భారత్‌కు ఈ సారి ఆహ్వానం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పంపడంపై ఆతిథ్య జర్మనీ తీవ్రంగా మల్లగుల్లాలు పడుతోంది. ఈ సదస్సు బవారియాలో జూన్‌లో జరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండించడానికి భారత్‌  అయిష్టత ప్రదర్శించడంపై జర్మనీ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఆహ్వానం పంపడంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనేందుకు సెనెగల్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయించింది. కానీ, భారత్‌ను ఆహ్వానించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభానికి ముందు వరకు భారత్‌ పేరు ఆహ్వానితుల జాబితాలో ఉంది. అయినా ఇప్పటి వరకూ నిర్ణయం మాత్రం వెలువడలేదు.

రష్యాను మానవహక్కుల కమిషన్‌ నుంచి బహిష్కరించే విషయంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌లో దాదాపు 50 దేశాలు పాల్గొనలేదు. వాటిలో భారత్‌ కూడా ఉండటంతోపాటు.. ఇప్పటి వరకు రష్యాపై ఎటువంటి ఆంక్షలను విధించలేదు. ఈ పరిణామాలతో జర్మనీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జర్మనీ ప్రతినిధి స్టీఫెన్‌ హెబెస్ట్రీట్‌ మాట్లాడుతూ.. అతిథుల జాబితాకు త్వరలో తుదిరూపు ఇస్తామని వెల్లడించారు. ‘‘రష్యాపై ఆంక్షల విషయంలో అంతర్జాతీయంగా వీలైనంత ఎక్కువ మంది భాగస్వాములు ఉండేలా చూసుకోవాలన్నది మా ఛాన్సలర్‌ అభిమతం. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు’’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు సాయం అందించడం, రష్యాపై ఆంక్షలు విధించడంలో జీ7 దేశాలు ముందుంటున్న విషయం తెలిసిందే.

మరోపక్క జర్మనీ ఇప్పటికీ రష్యా నుంచి వచ్చే చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని ఉక్రెయిన్‌, పోలాండ్‌లు విమర్శించాయి. దేశీయంగా కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కసారిగా చమురు సరఫరాలను రష్యా నుంచి మళ్లించలేమని గతంలో జర్మనీ తేల్చిచెప్పింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని