murder: హంతకులకు అడ్రస్‌ చెప్పిన ఇన్‌స్టా పోస్టు.. మోడల్‌ హత్యలో కీలక విషయాలు

ఈక్వెడార్‌ సోషల్‌ మీడియా స్టార్‌, మోడల్‌ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

Updated : 05 May 2024 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆ దేశంలోని అందగత్తెల్లో ఆమె ఒకరు.. ఆపై సోషల్‌ మీడియా స్టార్‌. ఈ క్రమంలో సదరు బ్యూటీ చేసిన ఓ పోస్టే ఆమెకు ప్రాణాంతకంగా మారింది. తన కోసం గాలిస్తున్న హంతకులకు చిరునామా ఇచ్చినట్లైంది. కొద్ది సేపట్లోనే ఆమెపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఈక్వెడార్‌లో జరిగింది. అత్యంత నాటకీయంగా మోడల్‌ లాండీ పరాగా గోయ్‌బురో హత్యకు గురైంది. అసలేం జరిగిందంటే..

లాండీ పరాగా ఈక్వెడార్‌లోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. దాంతో ఆ మోడల్‌ను చంపడానికి కాపు కాసిన ఇద్దరు దుండగులు ఆ పోస్టు ద్వారా ఆమె ఎక్కడ ఉన్నది తెలుసుకున్నారు. వెంటనే ఆ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. లాండీ తన స్నేహితుడితో మాట్లాడుతుండగా దుండగులు తుపాకులతో లోపలికి ప్రవేశించి ఆమెపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

లాండీ పరాగా మిస్‌ ఈక్వెడార్‌ కంటెస్టెంట్‌. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌. ఆమెకు మాదకద్రవ్యాల డీలర్‌ లియోనార్డో నోరెరోతో అఫైర్‌ ఉన్నట్లు సమాచారం. గతేడాది జైల్లో జరిగిన ఓ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నోరెరో భార్య ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని