Ukraine Crisis: ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పేరిట ఎవరూ లేరు .. అదో బ్రిగేడ్‌..!

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టినప్పటి  నుంచి ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ అనే రహస్య పైలట్‌ పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోతోంది. ఇటీవల స్తెపాన్‌ తారాబల్కా(29) రష్యా దాడిలో మరణించాడని.. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ అమరడయ్యాడని సామాజిక

Updated : 02 May 2022 10:46 IST

 వెల్లడించిన ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టినప్పటి  నుంచి ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ అనే రహస్య పైలట్‌ పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోతోంది. ఇటీవల స్తెపాన్‌ తారాబల్కా(29) రష్యా దాడిలో మరణించాడని.. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ అమరుడయ్యాడని సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. యుద్ధం ఆరంభమైన తొలిరోజు రష్యా విమానాలను కకావికలం చేశాడనే కథలు ప్రచారం అయ్యాయి. ప్రతిష్ఠాత్మక ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గోల్డెన్‌ స్టార్‌’ పురస్కారంతోనూ ఉక్రెయిన్‌ అతడిని గౌరవించింది. కానీ, ఇక్కడే ఉక్రెయిన్‌ వాయుసేన ఒక ట్విస్ట్‌ ఇచ్చింది..‘‘ ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ మరణించాడనే ప్రచారం సరైనది కాదు. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. కీవ్‌ను రక్షించేందుకు పనిచేస్తున్న అత్యంత సుశిక్షత పైలట్ల బృందమైన ‘టాక్టికల్‌ ఏవియేషన్‌ బ్రిగేడ్‌’కు ఉద్దేశించిన పేరు అది’’ అని ట్విటర్‌లో పేర్కొంది. 40వ టాక్టికల్‌ ఏవియేషన్‌ బ్రిగేడ్‌ పేరును ఉక్రెయినియన్లు ఆ విధంగా పెట్టినట్లు ఫేస్‌బుక్‌లో ఉంచిన పోస్టులో పేర్కొంది. 

ఉక్రెయిన్‌ వాయుసేన ప్రకారం స్తెపాన్‌ తారాబల్కా 40 విమానాలను కూల్చలేదు. ఈ విజయాలను ఏ ఒక్క వ్యక్తికో ఆపాదించకుండా సమష్టిగా చూడాలని ఉక్రెయన్‌ వాయుసేన వెల్లడించింది. నమ్మకమైన సమాచారం స్వచ్ఛతను దెబ్బతీయవద్దని తాము కోరుతున్నట్లు ఉక్రెయిన్‌ వాయుసేన పేర్కొంది. సమాచార వ్యాప్తికి ముందు దాని మూలాలను పరిశీలించాలని పేర్కొంది. మార్చి 13న స్తెపాన్‌ తారాబల్కా మరణించాడని వెల్లడించింది. అతనికి సంబంధించిన నమ్మకమైన సమాచారం వివరాలను కూడా ఉక్రెయిన్‌ వాయుసేన ఫేస్‌బుక్‌లో పంచుకొంది. తారాబల్కా యోధుడని.. అతడు ఘోస్ట్‌ కాదని ఉక్రెయిన్‌ వెల్లడించింది. తొలుత ‘టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌’ పత్రిక ఈ ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ మృతి ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఈ పేరు హోరెత్తింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని