Nigeria: నైజీరియాలో బందిపోట్ల దాడి.. వందల మంది మృతి..!

నైజీరియాలో బందిపోట్లు నరమేధం సృష్టిస్తున్నారు. మంగళవారం నుంచి గురువారం మధ్య ప్రజలపై పలుమార్ల దాడులు చేసి దోపిడీలకు పాల్పడ్దారు. ఈ

Updated : 09 Jan 2022 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నైజీరియాలో బందిపోట్లు నరమేధం సృష్టిస్తున్నారు. మంగళవారం నుంచి గురువారం మధ్య ప్రజలపై పలుమార్ల దాడులు చేసి దోపిడీలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. గత సోమవారం ఇక్కడి సైనిక దళాలు అడవుల్లోని సాయుధులపై దాడి చేసి 100 మందిని మట్టుబెట్టాయి. దీనికి ప్రతిగా వారు జంఫారా రాష్ట్రంలో దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో దాదాపు 100 మంది చనిపోయి ఉండొచ్చని తొలుత భావించినా.. ఆ తర్వాత మృతుల సంఖ్య 200కు చేరింది. భారీ ఆయుధాలతో మోటార్‌సైకిళ్లపై వచ్చిన ముష్కరులు ఇళ్లను దహనం చేయడంతోపాటు మనుషుల్ని ఊచకోత కోశారు. ఈ క్రమంలో 2,000 పశువులను దొంగిలించారు.

ఇక్కడి క్రిమినల్‌ గ్యాంగ్‌లతో ప్రభుత్వ దళాలకు ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వీరిని బందిపోట్లుగా పేర్కొంది.  ప్రభుత్వ దళాల దాడులను తప్పించుకొనేందుకు  ఈ బందిపోట్లు జంఫారా రాష్ట్రం వైపు వెళ్లినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడి ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ బుహారీ మాట్లాడుతూ ‘సాయుధులపై పోరాటంలో ప్రభుత్వ దళాలు వెనక్కి తగ్గేది లేదు. తాజా దాడి బందిపోట్ల నిస్పృహను తెలియజేస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ బందిపోట్లను కూడా ఉగ్రవాదులగా ప్రకటిస్తూ కఠిన వైఖరి అనుసరిస్తామని అక్కడి ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని