White House: ఆ విషయాల్లో.. మోదీకి బైడెన్‌ ఉపదేశం చేయరు!

మావన హక్కులపై ప్రధాని మోదీకి (Narendra Modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎలాంటి ఉపదేశం చేయరని అమెరికా అధ్యక్ష భవనం (White House) వెల్లడించింది.

Published : 21 Jun 2023 18:44 IST

వాషింగ్టన్‌: భారత్‌లో మానవ హక్కులపై (Human Rights) ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా ఇటీవల కొన్ని ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో, మానవ హక్కులు, మత స్వేచ్ఛ గురించి ప్రస్తావించాలని అమెరికా కమిషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలిజియస్‌ ఫ్రీడం వంటి సంస్థలు, కొందరు చట్టసభ సభ్యులూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష భవనం (White House) కీలక వ్యాఖ్యలు చేసింది. మానవ హక్కులపై ప్రధాని మోదీకి (Narendra Modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎలాంటి ఉపదేశం చేయరని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నేటితరం బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాల్లో ఒకటిగా ఇరు దేశాల బంధాన్ని చూస్తామని తెలిపింది.

‘ నరేంద్ర మోదీకి జో బైడెన్‌ ఉపదేశం ఇవ్వరు. పత్రికా, మత, ఇతర స్వేచ్ఛల విషయంలో ఎదురవుతోన్న సవాళ్ల విషయానికొస్తే.. మా అభిప్రాయాలను మేం తెలియజేస్తాం. ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, మాకు సవాళ్లు లేవని చెప్పడం కానీ చేయము. భారత్‌లో రాజకీయాలు, ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎక్కడికి వెళ్తున్నాయనే ప్రశ్నలకు అక్కడి వారే (భారతీయులు) నిర్ణయిస్తారు. అమెరికాలో అవి నిర్ణయించబడవు’ అని వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ స్పష్టం చేశారు. ఇక ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి చెక్‌ పెట్టడంపై బైడెన్‌, మోదీల మధ్య చర్చ ఉంటుందా అన్న ప్రశ్నకు సల్లివాన్‌ స్పందించారు. ఇది చైనా పర్యటన కాదని, అయినప్పటికీ సైన్యం, టెక్నాలజీ, ఆర్థికవ్యవస్థ వంటి విషయాల్లో చైనా పాత్ర తప్పకుండా ప్రస్తావనకు వస్తుందన్నారు.

మరోవైపు, భారత్‌తో బంధం విషయంలో అమెరికాకు ఉన్న అన్ని అంశాలను ప్రధాని మోదీతో నేరుగా ప్రస్తావించాలని అధ్యక్షుడు బైడెన్‌కు చట్టసభ సభ్యులు ఇటీవల సూచించారు. రెండు దేశాల మధ్య విజయవంతమైన, బలమైన, దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి ముఖ్యమైన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని 75 మంది చట్టసభ సభ్యులు కోరారు. ఈ మేరకు వారు బైడెన్‌కు లేఖ రాశారు. అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కుల రక్షణ, మీడియా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, బహుళత్వం అనేవి అతి ముఖ్యమైన అంశాలని.. ఇక్కడ అమలయ్యే ఈ విధానాలను మన మిత్ర దేశాల్లోనూ అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని