Kamala Harris: తప్పు చేయొద్దు.. రష్యాకు కమలా హారిస్‌ గట్టి హెచ్చరిక

ఉక్రెయిన్‌ వివాదం విషయంలో రష్యాపై అమెరికా తన స్వరాన్ని పెంచింది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడితే.. తాము, మిత్రదేశాలతో కలిసి మునుపెన్నడూ లేని ఆర్థిక ఆంక్షలను విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా...

Published : 20 Feb 2022 01:47 IST

బెర్లిన్‌: ఉక్రెయిన్‌ వివాదం విషయంలో రష్యాపై అమెరికా తన స్వరాన్ని పెంచింది. ఒకవేళ ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడితే.. తాము, మిత్రదేశాలతో కలిసి మునుపెన్నడూ లేని ఆర్థిక ఆంక్షలను విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా.. పొరుగున నాటోను మరింత బలోపేతం చేస్తామన్నారు. శనివారం మ్యూనిక్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ వేదికగా కమలా హారిస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా ఆక్రమణకు పాల్పడితే ఐక్యతతో కూడిన వేగవంతమైన, తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. ‘మేం దీర్ఘకాలిక ఆర్థిక, ఎగుమతుల ఆంక్షలు విధిస్తాం. రష్యా ఆర్థిక సంస్థలు, కీలక పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంటాం. రష్యాకు సహకరించేవారినీ వదిలిపెట్టం’ అని కమలా హారిస్‌ పేర్కొన్నారు. ‘ఈ విషయంలో తప్పు చేయొద్దు. కఠిన ఆంక్షలతో పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుంది’ అని రష్యాను ఉద్దేశించి అన్నారు.

‘ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే అమెరికా.. మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధిస్తుందని కచ్చితంగా చెప్పగలను’ అని హారిస్‌ అంతకుముందు ఓ ట్వీట్‌ చేశారు. ప్రస్తుత జర్మనీ పర్యటనలో భాగంగా హారిస్ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో వేర్వేరుగా సమావేశం కానున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌తో ఉద్రిక్తతల వేళ రష్యా శనివారం భారీ ఎత్తున క్షిపణుల విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని