Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్‌: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!

విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్‌, పారిస్‌లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? 

Updated : 19 Jan 2024 19:34 IST

దుబాయ్‌: ప్రైవేటు విమానాలు, వందల్లో కార్లు, వేలకోట్ల రూపాయల విలువైన భవంతి.. ఈ సంపద గురించి వింటుంటే కళ్లు చెదిరిపోతుంది కదా..!  ఈ విలాస జీవితం యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌(Sheikh Mohamed bin Zayed Al Nahyan) రాజ కుటుంబం(royal family of Dubai) సొంతం. 305 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో వాల్టన్‌ కుటుంబాన్ని దాటి.. 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. అంటే ఆ సంపద విలువ అక్షరాలా రూ.25,38,667 కోట్లు.

యూఏఈని పాలిస్తోన్న షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌.. ఈ కుటుంబ పెద్ద. 18 మంది సోదరులు, 11 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఇక ఆస్తుల విషయానికొస్తే..  ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. 2008లో రూ.2,122 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన  మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ వీరి యాజమాన్యంలోనే ఉంది. అలాగే ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌, ప్రముఖ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్‌ ఫెంటీతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లో వాటాలున్నాయి. ఇక దుబాయ్‌ పాలకుడు సోదరుడి వద్ద 700కు పైగా కార్ల కలెక్షన్‌ ఉంది. వాటిలో విలాసవంతమైన బుగాటి, లంబోర్గిని, మెర్సిడెస్‌ బెంజ్‌ బ్రాండ్‌లున్నాయి. వారి కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఆదాయం గత ఐదేళ్ల కాలంలో 28,000 శాతం పెరగడం విశేషం.

ఈ రేంజ్‌లో ఆస్తిపాస్తులున్న ఈ కుటుంబం నివసించే భవంతి ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. అబుదాబీలోని ఖాసర్ అల్‌ వాటన్‌ అధ్యక్ష భవనంలో రాజకుటుంబ సభ్యులు ఉంటున్నారు. యూఏఈ(UAE)లో వారికున్న ఎన్నో భవనాల్లో అతి పెద్దది ఇదే. పెంటగాన్‌ వైశాల్యానికి మూడు రెట్లు ఎక్కువ.  94 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీని విలువ రూ. 4,078 కోట్లు. 37 మీటర్ల వెడల్పాటి డోమ్ ఈ ప్యాలెస్‌కు ప్రత్యేక ఆకర్షణ. లండన్‌, పారిస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీరికి ఆస్తులున్నాయి. 2015 లెక్కల ప్రకారం.. లండన్‌లో బ్రిటిష్ రాజకుటుంబంతో సరిసమానమైన ఆస్తులు కలిగిఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇవిగాక, వేల కోట్లు విలువ చేసే నౌకలు, విమానాలు వారి లగ్జరీకి నిదర్శనం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని