Nepal: నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురి మృతి!

నేపాల్‌లో ఐదుగురు మెక్సికన్‌ దేశస్థులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఎవరస్ట్‌ శిఖరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 11 Jul 2023 13:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నేపాల్‌లో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ గల్లంతైన ఘటన విషాదంగా మారింది. ఆ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఐదుగురు మెక్సికన్‌లతో సహా మొత్తం ఆరుగురు ఉన్నారని తెలిపారు. వీరంతా మృతి చెందినట్లు సమాచారం. సోలుకుంభు నుంచి కాఠ్‌మాండూ(Kathmandu)కు ప్రయాణిస్తుండగా ఎవరెస్టు శిఖరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు.

9ఎన్‌-ఏఎంవీ కాల్‌ సైన్‌తో వ్యవహరించే ఈ హెలికాప్టర్‌ సోలుకుంభులోని సుర్కీ అనే  ప్రదేశం నుంచి గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకొంది. దీనిని సీనియర్‌ పైలట్‌ చెట్‌ గురుంగ్‌ నడుపుతున్నారు. అతడితోపాటు ఐదుగురు విదేశీయులు కూడా ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకొన్న ప్రదేశం ఎవరెస్ట్‌ శిఖరానికి సమీపంలో ఉంటుంది. ఈ విషయాన్ని నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారి జ్ఞానేంద్ర భుల్‌ నేపాల్‌ పత్రికకు వెల్లడించారు. ఆ హెలికాప్టర్లో అమర్చిన జీపీఎస్‌ సంకేతాలు లమ్జురాపాస్‌ వద్ద నిలిచిపోయినట్లు ఆయన చెప్పారు.

అదే సమయంలో లిఖుపికే రూరల్‌ మున్సిపాలిటీ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు గుర్తించారు. పైలట్‌ చెట్‌ గురుంగ్‌తో పాటు మరో ఐదుగురు మెక్సికన్‌ల మృతదేహాలనూ ఘటనా ప్రాంతంలో కనుగొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ ఏడాది జనవరిలో రాజధాని కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 72 మంది మరణించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని