Maldives row: ‘మా దేశానికి విమాన బుకింగ్‌లు తెరవండి’: ఈజ్‌మైట్రిప్‌ సంస్థకు మాల్దీవుల సంఘం అభ్యర్థన

తమ దేశానికి విమానాల బుకింగ్‌లను తిరిగి తెరవాలని ఈజ్‌మైట్రిప్‌(EaseMyTrip) సంస్థను మాల్దీవులకు (Maldives) చెందిన టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్ల సంఘం (MATATO) కోరింది.

Updated : 11 Jan 2024 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లక్షద్వీప్‌పై మాల్దీవుల(Maldives) మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌(EaseMyTrip).. మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడి టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్ల సంఘం(MATATO) స్పందించింది.

తమ నేతలు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈజ్‌మైట్రిప్‌ను కోరింది. ఆ మాటలు మాల్దీవుల ప్రజల అభిప్రాయం కాదని వెల్లడించింది. ఈజ్‌మైట్రిప్(EaseMyTrip) తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, తమ దేశానికి విమాన బుకింగ్‌లను తెరవాలని మటాటో లేఖ రాసింది.  రెండు దేశాల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని, భారతీయులను సొంతవారిగా భావిస్తామని వెల్లడించింది. తమ పర్యాటక రంగంలో భారతీయులు అత్యంత కీలకమని తెలిపింది. ఈ నేతల వ్యాఖ్యలను ఆ దేశ పర్యాటక పరిశ్రమ సంఘం (మాటీ) ఖండించిన సంగతి తెలిసిందే. ‘భారత్‌ మాకు స్థిరమైన, కీలక పర్యాటక వనరు. కొవిడ్‌ తర్వాత మేం కోలుకోవడానికి ఆ దేశం ఎంతో సాయం చేసింది. అంతేకాదు.. మా దేశానికి అతి సన్నిహితమైన దేశం భారత్‌. ప్రతి సంక్షోభంలోనూ ఆ దేశమే తొలిసారిగా స్పందిస్తుంది. అందుకు మేం ఆ దేశానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం’ అని ప్రకటన విడుదల చేసింది. 

త్వరలో భారత్‌కు ముయిజ్జు

ఈ పరిణామాల మధ్య మాల్దీవుల(Maldives) ప్రభుత్వం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, ముందుగానే ఈ పర్యటన ఖరారైనట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని