త్వరలో భారత్‌కు ముయిజ్జు

మోదీ, లక్షద్వీప్‌పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవుల ప్రభుత్వం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Updated : 10 Jan 2024 05:23 IST

మాలె: మోదీ, లక్షద్వీప్‌పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవుల ప్రభుత్వం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల అధికారులు.. అధ్యక్షుడి దిల్లీ పర్యటనకు షెడ్యూలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగానీ, ఫిబ్రవరి మొదటి వారంలోగానీ ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, అంతకంటే ముందుగానే మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది యూఏఈలో జరిగిన కాప్‌ 28 పర్యావరణ సదస్సులో భారత ప్రధాని మోదీతో ముయిజ్జు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన దిల్లీ పర్యటనపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

విశాల దృక్పథంతో ఆలోచించాలి: చైనా

బీజింగ్‌: ప్రధాని మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై చైనా మరోసారి తన అక్కసును చాటుకుంది. భారత్‌ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకీయాన్ని ప్రచురించింది. ‘మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భారత్‌, చైనా మధ్య ఘర్షణల కారణంగా దిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదు. ఈ ద్వీప దేశానికి భారత్‌ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో దిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి చైనాను నిందించడం మాని.. భారత్‌ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని చైనా వ్యాఖ్యానించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ ఈ స్పందన రావడం గమనార్హం.

భారత్‌ మనకు ‘911 కాల్‌’ వంటిది: మాజీ మంత్రి

భారత్‌ తమకు మిత్ర దేశమని, ఎల్లప్పుడూ సాయం చేస్తుందని మాల్దీవుల రక్షణశాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్‌ పేర్కొన్నారు. అది ఆపత్కాలంలో ఆదుకునే ‘911 కాల్‌’ వంటిదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వంలో దూర దృష్టి లోపించింది. అందరితో స్నేహంగా ఉండే చిన్న దేశం మనది. అదే సమయంలో భారత్‌ పొరుగు దేశమన్న విషయాన్ని మరవకూడదు. రెండు దేశాలకు ఒకే రకమైన సవాళ్లున్నాయి. భారత్‌ ఎల్లప్పుడూ మనకు సాయం చేస్తుంది. ఇతర రంగాలతోపాటు రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సహకరిస్తోంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఇరు దేశాలదీ ఒకే వైఖరి. ఇలాంటి చిరకాల మైత్రిని దెబ్బతీసే ఏ ప్రయత్నమూ సరికాదు’ అని వ్యాఖ్యానించారు.

మాల్దీవుల ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు దిగిపోవాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పార్లమెంటరీ మైనారిటీ నేత అలీ అజీం పిలుపునిచ్చారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని