plane crash: విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లకు శక్తిని ఆపేశారు.. నేపాల్‌ ప్రమాదంపై నివేదిక

నేపాల్‌లో ఏడాది క్రితం జరిగిన విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దర్యాప్తు కమిషన్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

Published : 29 Dec 2023 14:44 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో ఈ ఏడాది జనవరిలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో (Plane Crash) 72 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దర్యాప్తు కమిషన్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఇంజిన్లకు శక్తిని అందించే వ్యవస్థను పైలట్లు పొరపాటున నిలిపివేయడంతో విమానం క్షణాల్లోనే కుప్పకూలిపోయిందని పేర్కొంది.

‘ఇంజిన్ల శక్తిని నియంత్రించే వ్యవస్థపై అవగాహన లేమితో పాటు దాని వినియోగంలో తగిన విధానాలను పైలట్లు పాటించలేదు. ఫ్లాప్‌ లివర్‌కు (Flap lever) బదులు శక్తిని నియంత్రించే కండీషన్‌ లివర్స్‌ (Condition levers) ఉపయోగించారు. దాంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. విమానం ముందుకెళ్లడానికి అవసరమైన శక్తిని (thrust) ఇంజిన్‌ ఉత్పత్తి చేయకుండా 49 సెకన్లపాటు నిలిచిపోయింది. ఈ సమస్యను అధిగమించేందుకు అవసరమైన అత్యవసర సూచనలను కూడా వారు పాటించలేదు. ఈ క్రమంలోనే విమానం కుప్పకూలిపోయింది’ అని దర్యాప్తులో బృందంలోని ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ దీపక్‌ ప్రసాద్‌ బస్తోలా వెల్లడించారు.

పాకిస్థాన్‌లో న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం.. ఎందుకంటే..?

నేపాల్‌లో యతి ఎయిర్‌లైన్స్‌కు (Yeti Airlines) చెందిన ఏటీఆర్‌ 72 విమానం జనవరి 15న కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని ఫొఖారాకు (Kathmandu and Pokhara) బయలుదేరింది. మరికొన్ని క్షణాల్లో గమ్య స్థానం చేరుకుంటుదనగా ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఆ దుర్ఘటనలో అయిదుగురు భారతీయులు సహా 72 మంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు చిన్నారులు, నలుగురు విమాన సిబ్బంది, 15 మంది విదేశీయులున్నారు. అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. గడిచిన 30 ఏళ్లలో అక్కడ  ఈ స్థాయి ప్రమాదం ఎన్నడూ జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని