Imran Khan: నా జీవితం ప్రమాదంలో ఉంది: ఇమ్రాన్‌

ప్రతిపక్షాలు తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ కష్టాలన్నిటికీ ఆ ‘శక్తిమంతమైన దేశమే’ కారణం అన్నట్టుగా అమెరికా వైఖరిపై ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ విరుచుకుపడ్డారు.

Updated : 02 Apr 2022 10:33 IST

ఇస్లామాబాద్‌, వాషింగ్టన్‌: ప్రతిపక్షాలు తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి గడువు సమీపిస్తున్న తరుణంలో పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. తన జీవితం ప్రమాదంలో ఉందని తెలిపారు. అయినా భయపడనని.. ప్రజాస్వామ్య పాకిస్థాన్‌ కోసం పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ‘‘నాతోపాటు నా భార్యను కూడా లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ శక్తుల ప్రోద్బలంతో ప్రతిపక్షాలు నా వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతున్నాయి. ‘ఎస్టాబ్లిష్‌మెంట్‌’ (శక్తిమంతమైన ఆ దేశ సైనిక వ్యవస్థనుద్దేశించి) నా ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంచింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, ప్రధాని పదవికి రాజీనామా చేయడం.. ఈ మూడు మార్గాలను నా ముందు ఉంచింది. ఈ ‘అవిశ్వాసం’లో నేను గెలిస్తే ముందస్తు ఎన్నికలకే వెళతా. మరొకరిపై ఆధారపడకుండా ప్రజలు సింపుల్‌ మెజారిటీ ఇచ్చినా చాలు’’ అంటూ శుక్రవారం ఏఆర్‌వై న్యూస్‌ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు.

అగ్రరాజ్యంపై మండిపాటు..

అగ్రరాజ్యం అమెరికాపైనా ఇమ్రాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌-అమెరికా మైత్రిపై పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కారు. పాకిస్థాన్‌ కష్టాలన్నిటికీ ఆ ‘శక్తిమంతమైన దేశమే’ కారణం అన్నట్టుగా అమెరికా వైఖరిపై ఇమ్రాన్‌ విరుచుకుపడ్డారు. ఎక్కడా అమెరికా పేరెత్తకుండా అగ్రరాజ్యంపై విమర్శలు గుప్పించారు. ఇస్లామాబాద్‌లో జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌ను తాను కలుసుకోవడం నచ్చని ఆ ‘శక్తిమంతమైన దేశం’ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటున్న భారత్‌కు మద్దతునిస్తూ, పాక్‌ విషయంలో ఆగ్రహంగా ఉందన్నారు. ఇన్నాళ్లూ ఓ స్వతంత్ర విదేశీ విధానం లేకుండా, ఇతర శక్తిమంతమైన దేశాలపై ఆధారపడటం వల్లే పాక్‌ వెనుకబడిందని తెలిపారు. ఈ సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే ఇస్లామాబాద్‌లోని అమెరికన్‌ రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్‌ అధికారి ఏంజెలా పి అగ్లెర్‌ను పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం పిలిపించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా నిరసన తెలుపుతూ ఓ లేఖ కూడా అందజేసింది. పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘విదేశీ కుట్ర’ జరుగుతోందని ఇమ్రాన్‌ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ ప్రభుత్వం కొనసాగితే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా అధికారులు హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. పాక్‌ సమాచారశాఖ మంత్రి ఫవద్‌ చౌధ్రి మరో అడుగు ముందుకువేసి.. ఇమ్రాన్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిఘావర్గాల సమాచారంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రధాని భద్రతను కట్టుదిట్టం చేసినట్లు స్థానిక ‘డాన్‌’ పత్రిక పేర్కొంది.

ఇమ్రాన్‌ ఆరోపణలు నిజం కాదు : అమెరికా

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపణలను అమెరికా తిరస్కరించింది. ఆ ఆరోపణలు వాస్తవం కాదని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంటు అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ వివరణ ఇచ్చారు. పాకిస్థాన్‌లోని పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని.. అక్కడి రాజ్యాంగ విధానాలకు, చట్టానికి తమ దేశం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.

గతంలో జుల్ఫికర్‌ అలి భుట్టో కూడా.. : 1977 ఏప్రిల్‌ 29న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలి భుట్టో కూడా అమెరికాపై ఇటువంటి ఆరోపణలే చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఓ అంతర్జాతీయ కుట్రకు ఆర్థికసాయం చేస్తోందని మండిపడ్డారు. వియత్నాం యుద్ధంలో మద్దతు ఇవ్వనందుకు.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అరబ్‌ దేశాలకు మద్దతు ఇచ్చినందుకు ఇలా చేస్తోందన్నారు. ఆ తర్వాత మూడు నెలల్లోనే జనరల్‌ జియావుల్‌ హక్‌ నేతృత్వంలో పాక్‌ సైన్యం తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకొంది. అవినీతి ఆరోపణలపై విచారణ అనంతరం భుట్టోను ఉరి తీసింది.

ప్రధానిగా ఇమ్రాన్‌ అసమర్థుడు : మాజీ భార్య రెహమ్‌ఖాన్‌

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. కష్టకాలం ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్‌ఖాన్‌ కూడా ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ‘పాకిస్థాన్‌ ప్రధానమంత్రి కాగలిగేటంత తెలివి, సామర్థ్యం ఇమ్రాన్‌కు లేవు. ఆయన ప్రధాని కాకముందే పాక్‌ బాగుండేది. ఇమ్రాన్‌ ఇక గతం. ‘నయా పాకిస్థాన్‌’ పేరిట తను సృష్టించిన గందరగోళాన్ని తుడిచేసుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించాలి’ అని ఆమె ట్వీట్‌ చేశారు. బ్రిటిష్‌ - పాకిస్థానీ జర్నలిస్టు అయిన ఈమె 2014లో ఇమ్రాన్‌ను పెళ్లాడి, ఏడాది తర్వాత విడాకులు తీసుకొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని