40 రోజుల కాల్పుల విరమణ!

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్‌ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్‌కు పంపాయి!.

Published : 30 Apr 2024 04:15 IST

హమాస్‌కు ఇజ్రాయెల్‌ ప్రతిపాదన
నెతన్యాహుతో మాట్లాడిన బైడెన్‌
రఫాపై బాంబులు.. 22 మంది మృతి

జెరూసలెం: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్‌ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్‌కు పంపాయి!. ఇందులో 40 రోజుల కాల్పుల విరమణకు టెల్‌ అవీవ్‌ సుముఖత వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హమాస్‌ చెరలోని బందీల విషయంలోనూ టెల్‌ అవీవ్‌ కాస్త పట్టు సడలించింది. 40 మంది కంటే తక్కువ మందిని విడుదల చేసినా ఒప్పందానికి తాము సిద్ధమేనన్న సంకేతం పంపింది. ప్రస్తుతం హమాస్‌ చెరలో 133 మంది బందీలు ఉన్నట్లు అంచనా. ఇందులో 30 మంది మృతి చెందారన్న అనుమానాలు ఉన్నాయి. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్‌ భారీస్థాయిలో పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. హమాస్‌ మాత్రం 40 రోజులు కాకుండా, శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటోంది. తాజా ప్రతిపాదనకు హమాస్‌ అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తంచేస్తోంది. ‘‘హమాస్‌ ముందు అద్భుతమైన ప్రతిపాదన ఉంది. ఇజ్రాయెల్‌ చాలా ఉదారంగా వ్యవహరించింది. ప్రస్తుతమైతే గాజా ప్రజలకు, కాల్పుల విరమణకు మధ్య కేవలం హమాస్‌ మాత్రమే ఉంది. వారు తొందరగా నిర్ణయించుకోవాలి. సరైన నిర్ణయమే తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌ తెలిపారు. ఆయన సోమవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ఆ దేశ పర్యటన తర్వాత మంగళ, బుధవారాల్లో జోర్డాన్‌, ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. కాల్పుల విరమణ అంశంపైనా ఆదివారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు గాజాకు మానవతా సాయం పెంపుపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఓవైపు కాల్పుల విరమణపై ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్‌ రఫాపై తన దాడులను ఆపలేదు. సోమవారం జరిపిన గగనతల దాడుల్లో మరో 22 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు. ఇందులో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

మరో నౌకపై హూతీల దాడి

ఎర్ర సముద్రంలో హూతీల దాడులు ఆగడం లేదు. సోమవారం కూడా మాల్టా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై యెమన్‌ వేర్పాటువాదులు మూడు క్షిపణులు ప్రయోగించారు. నౌకకు నష్టం, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని