Sri Lanka: శ్రీలంకలో పెట్రోల్‌ నిల్‌.. ఒకే ఒక్కరోజుకు సరిపడా నిల్వలు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు కేవలం ఒక్కరోజుకు సరిపడ మాత్రమే అందుబాటులో ఉన్నాయని శ్రీలంక నూతన ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘె ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 16 May 2022 21:44 IST

మరో రెండు నెలలు ఇబ్బందులు తప్పవన్న రణిల్‌ విక్రమ సింఘే
జాతినుద్దేశించి ప్రసంగించిన శ్రీలంక నూతన ప్రధాని

కొలంబో: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు కేవలం ఒక్కరోజుకు సరిపడ మాత్రమే అందుబాటులో ఉన్నాయని శ్రీలంక నూతన ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘె ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతులకు చెల్లించడానికి తమ దగ్గర సరిపడా డాలర్లు లేవన్నారు. ఇందుకు అవసరమైన అమెరికా డాలర్లను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని రక్షించడమే తన లక్ష్యమన్న ఆయన.. కేవలం ఒక వ్యక్తిని, కుటుంబాన్ని లేదా ఓ బృందాన్ని రక్షించడం తన కర్తవ్యం కాదన్నారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించిన రణిల్‌.. రాజపక్స కుటుంబం, మాజీ ప్రధాని మహిందను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరో 2 నెలల అత్యంత దారుణం..

‘దేశంలో పెట్రోల్‌ నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం కేవలం ఒక్కరోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. వచ్చే రెండు నెలలు మన జీవితంలో అత్యంత కష్టమైన రోజులు. వాస్తవాలను దాచి ప్రజలకు అబద్ధాలు చెప్పాలని లేదు. వచ్చే రెండు నెలలు ఎదురయ్యే ఇబ్బందులను ఓపికతో తట్టుకోక తప్పదు. ఈ తరుణంలో దేశాన్ని కాపాడటమే నా లక్ష్యం. నేను ఇక్కడున్నది ఏ ఒక్క వ్యక్తినో, కుటుంబాన్నో లేదా బృందాన్నో రక్షించడానికి కాదు’ అని శ్రీలంక నూతన ప్రధానమంత్రి రణిల్‌ విక్రమ సింఘే ఉద్ఘాటించారు. ఇక త్వరలోనే 2022 అభివృద్ధి బడ్జెట్‌ స్థానంలో ఉపశమన బడ్జెట్‌ ప్రవేశపెడుతామన్న ఆయన.. భారీ నష్టాల్లో కూరుకుపోయిన శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించే ప్రతిపాదనను ప్రవేశపెడుతామని అన్నారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించినప్పటికీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్న ఆయన.. ఎన్నడూ విమానం ఎక్కని వారుకూడా ఆ భారాన్ని మోయాల్సి వస్తుందన్నారు.

ఇదిలాఉంటే, ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు ఈ సంక్షోభం వెంటాడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమైన రాజపక్స కుటుంబం గద్దె దిగాలంటూ దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలు ఇటీవల హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సూచన మేరకు రణిల్‌ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షోభ శ్రీలంకను గాడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని