Elon Musk: నాసా అపురూప చిత్రాన్ని ‘కిచెన్‌ ఫ్లాట్‌ఫాం’తో పోల్చిన మస్క్‌

నాసా విడుదల చేసిన అపురూప చిత్రంపై కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సెటైర్లు వేశారు. ఆ చిత్రాన్ని కిచెన్‌ స్లాబ్‌తో పోల్చారు........

Published : 16 Jul 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవాళి ఎన్నడూ చూడని అతి సుదూరమైన దృశ్యాన్ని నాసా (NASA) గత మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 13 బిలియన్‌ సంవత్సరాల క్రితం విశ్వానికి సంబంధించి ఇప్పటివరకూ తీసిన ఫొటోల్లో ఇదే అత్యంత స్పష్టమైన చిత్రం. కాగా ఆ చిత్రంపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సెటైర్లు వేశారు. ఆ అపురూప చిత్రాన్ని కిచెన్‌ ఫ్లాట్‌ఫాంతో పోల్చారు. నాసా విడుదల చేసిన చిత్రం కిచెన్‌ గట్టుపై వేసే గ్రానైట్‌లా ఉందంటూ ఓ ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. సెటైర్లు వేస్తూనే ‘మంచి ప్రయత్నం నాసా’ అంటూ రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

అంతరిక్ష ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన.. ‘జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ తీసిన తొలి చిత్రం ఈనెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వైట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. విశ్వానికి సంబంధించి అత్యద్భుతమైన ఈ చిత్రంలో వేలాది గెలాక్సీలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీలం, నారింజ, తెలుపు రంగుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిదేనని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ వివరించారు. ‘మేం 13 బిలియన్‌ సంవత్సరాల క్రితం నాటి విశ్వాన్ని అత్యంత స్పష్టంగా చూస్తున్నాం. ఇది బిగ్‌బ్యాంగ్‌ కంటే కేవలం 800 మిలియన్‌ సంవత్సరాల చిన్నది’ అని నెల్సన్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని