Pak Army: ‘పాకిస్థానీలు ఆ చిప్పను పక్కన పడేయాలి’.. దేశ ఆర్మీచీఫ్‌ వ్యాఖ్య

పాక్‌ యాచించడం మానేయాలని ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ పేర్కొన్నారు. ఓ వైపు చైనా నుంచి అదనపు రుణం కోసం యత్నిస్తున్న సమయంలో మునీర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  

Updated : 25 Jul 2023 15:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ విదేశీ రుణాలపై ఆధారపడటాన్ని మానేయాలని ఆ దేశ ఆర్మీచీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌ హితబోధ చేశారు. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఆయన ఖానేవాల్‌ మోడల్‌ అగ్రికల్చర్‌ ఫామ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావంతులు, గర్వించదగినవారు. పాక్‌ వాసులు కచ్చితంగా చిప్పను (బెగ్గర్స్‌ బౌల్‌) విసిరేయాలి’’ అని వ్యాఖ్యానించారు. అన్ని రకాల శక్తులను పాక్‌కు భగవంతుడు ఇచ్చాడని ఆసిం మునీర్‌ అన్నారు. తమ దేశ ప్రగతిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని తెలిపారు. దేశం, ప్రజల మధ్య తల్లీబిడ్డల బంధం ఉందని ఆయన వెల్లడించారు.

మాస్కోను వణికించిన ఉక్రెయిన్‌ డ్రోన్లు

ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడే వరకు పాక్‌ ఆర్మీ విశ్రమించదని మునీర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే పాక్‌ ఓ వ్యవసాయ విప్లవాన్ని చూస్తుందని జోస్యం చెప్పారు. తాము దేశం మొత్తం మోడల్‌ ఫామ్‌లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇవి చిన్న రైతులకు ఆధునిక సేద్యంలో సాయం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.

పాకిస్థాన్‌ చైనా నుంచి మరో భారీ రుణం అందుకోవడానికి సిద్ధమైన సమయంలో ఆర్మీచీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరో 600 మిలియన్‌ డాలర్ల రుణాన్ని పొందేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఒక్క జులై నెలలోనే పాక్‌ ప్రభుత్వం మొత్తం 2.44 బిలియన్‌ డాలర్ల మేరకు అప్పు చేసింది. వీటిల్లో చైనా నుంచి తెచ్చుకొన్న 2.07 బిలియన్‌ డాలర్లు కూడా ఉన్నాయి. 

ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ తన నివేదికలో పాక్‌ కష్టాలను వెల్లడించింది.  పాక్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక నిల్వల కొరత ప్రభావం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపైనే కాకుండా.. భవిష్యత్‌లో దేశ అవసరాలను తీర్చుకునేందుకు భయంకరమైన సవాల్‌ విసురుతుందని అభిప్రాయపడింది. తాజా ఆర్థిక సంవత్సరంలో అసలు, వడ్డీ కలిపి పాకిస్థాన్‌ 25 బిలియన్‌ డాలర్ల మేర చెల్లించాల్సి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో చెల్లింపు ప్రక్రియ వాయిదా పడింది. రానున్న రోజుల్లో పాక్‌కు ఇది మరింత భారంగా తయారవుతుందని మూడీస్‌ వెల్లడించింది. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్థాన్‌ నడుచుకోవాలని మూడీస్‌ నొక్కి చెప్పింది. అయితే, పాకిస్థాన్‌లో రాబోయే ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఆ దిశగా స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని