Titanic Sub: ‘నాన్న సంతోషం కోసం వెళ్లి..’ టైటాన్‌లో ప్రాణాలు కోల్పోయి!

అట్లాంటిక్‌ మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్‌ మినీ జలాంతర్గామిలో (Titan Submarine) పాకిస్థానీ బిలియనీర్‌ హెహ్‌జాదా దావూద్‌తోపాటు సులేమాన్‌ కూడా ఉన్నారు.  సులేమాన్‌కు ఈ యాత్ర చేయడం ఇష్టం లేకున్నప్పటికీ.. తండ్రిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోయాడు.

Published : 23 Jun 2023 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అట్లాంటిక్‌ మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్‌ మినీ జలాంతర్గామిలో (Titan Submarine) ఓషన్‌గేట్‌ సంస్థ సీఈవో స్టాక్టన్‌ రష్‌తో పాటు మరో నలుగురు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందులో పాకిస్థానీ బిలియనీర్‌ హెహ్‌జాదా దావూద్‌తో పాటు సులేమాన్‌ కూడా ఉన్నారు. సులేమాన్‌కు అసలు ఇటువంటి సాహస యాత్రలంటే భయమట. కేవలం తండ్రి అభీష్టం మేరకే ఈ టైటాన్‌లో వెళ్లి సముద్రగర్భంలో చనిపోయినట్లు అతడి సమీప బంధువులు వెల్లడించారు. ముఖ్యంగా ‘ఫాదర్స్‌ డే’ రోజున నాన్నను సంతోషపెట్టాలని భావించి.. చివరకు ప్రాణాలు కోల్పోవడాన్ని నమ్మలేకపోతున్నామని వాపోయారు.

పాకిస్థాన్‌ బిలియనీర్‌ షెహ్‌జాదా దావూద్‌ (48) కుమారుడు సులేమాన్‌ దావూద్‌ వయసు కేవలం 19ఏళ్లు. కెనడా నుంచి మొదలయ్యే ఈ ఓషన్‌గేట్‌ జలాంతర్గామి ప్రయాణానికి కొన్నిరోజుల ముందు ఈ యాత్రపై సులేమాన్‌ సంకోచించడంతో పాటు ఎంతో భయపడ్డాడట. ఈ విషయాన్ని షెహ్‌జాదా దావూద్‌ సోదరి అజ్మేష్‌.. అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘టైటానిక్‌ శిథిలాల సందర్శనకు వెళ్లిన వాళ్లలో  సులేమాన్‌ ఒక్కడే అతి చిన్న వయస్కుడు. మిగతా వాళ్లు వారి ఇష్టం మేరకు వెళ్లినప్పటికీ ఈ యువకుడు మాత్రం అలా జరగలేదు. సముద్రగర్భంలో యాత్ర చేసేందుకు సులేమాన్‌ సంకోచించాడు. అలా వెళ్లడానికి ఇష్టపడకపోగా.. చాలా భయపడ్డాడు. ఈ యాత్ర ‘ఫాదర్స్‌ డే’ రోజున జరుగుతున్నందున తన తండ్రిని సంతోషపెట్టాలని అనుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’ అని దావూద్‌ సోదరి పేర్కొన్నారు. ఆ యాత్ర విషాదాంతమైందని తెలుసుకున్న ఆమె.. సులేమాన్‌ చనిపోయాడన్న వార్తను నమ్మలేకపోతున్నానని విలపించారు.

షెహ్‌జాదా దావూద్‌, అజ్మేష్‌ దావూద్‌లు పాకిస్థాన్‌లో ప్రముఖ కార్పొరేట్‌ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయం, ఆరోగ్యంతో పాటు ఇతర రంగాల్లో వీరి పెట్టుబడులున్నాయి. దావూద్‌  హెర్క్యూల్స్‌  కార్పొరేషన్‌తో పాటు మరిన్ని సంస్థలు వీరి సొంతం. ఇదిలాఉంటే వీరితో పాటు ప్రయాణించిన  యూఏఈలో ఉంటున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఫ్రెంచ్‌ మాజీ నావికా అధికారి పాల్‌ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ ఈ జలాంతర్గామి ప్రమాదంలో మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని