Pakistan PM: తోషాఖానా బహుమతులను వేలానికి పెట్టిన ప్రధాని షెహబాజ్‌

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తోషాఖానాలోని బహుమతులను వేలం వేసి అనాథల కోసం ఖర్చుపెట్టాలని నిర్ణయించారు.

Published : 09 Aug 2023 12:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ (Pakistan) ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు చోటు చేసుకున్న కొన్ని రోజుల్లోనే షెహబాజ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

తోషాఖానాలోని బహుమతులను వేలం వేయగా వచ్చిన నిధులను.. పేదలు, నిస్సహాయుల కోసం వినియోగిస్తామని షెహబాజ్‌ వెల్లడించినట్లు పాక్‌ పత్రికలు పేర్కొన్నాయి. ‘‘మిలియన్ల విలువైన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించాను. ఈ వేలం నుంచి వచ్చిన సొమ్మును అనాథ పిల్లలను పోషించే సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు, విద్యాసంస్థలకు ఇస్తాను. అనాథ పిల్లల కోసం ఓ పద్దతి ప్రకారం వాటిని వినియోగిస్తాం’’ అని షెహబాజ్‌ పేర్కొన్నారు. కౌన్సిల్‌ ఆఫ్‌ పాకిస్థానీ న్యూస్‌ పేపర్స్‌, ఆల్‌ పాకిస్థానీ న్యూస్‌ పేపర్స్‌ సొసైటీ, పాకిస్థానీ బ్రాడ్‌కాస్టర్స్‌ అసొసియేషన్‌ సభ్యులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో తీవ్ర తుపాను.. ఇద్దరి మృతి

భవిష్యత్తులో ఎన్నికల తర్వాత రాబోయే కొత్త ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని షెహబాజ్‌ వెల్లడించారు. కానీ, సంకీర్ణంలోని రాజకీయ పార్టీలు దీనిని అర్థం చేసుకోవడంలేదన్నారు.

పాకిస్థాన్లో 1974లో క్యాబినెట్‌ డివిజన్‌ కింద పనిచేసేలా తోషాఖానా డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. దీనిలో ప్రభుత్వ అధినేతకు, పార్లమెంట్‌ సభ్యులకు, అధికారులకు విదేశీ అతిథులు ఇచ్చిన బహుమతులను భద్రపర్చుతారు. కానీ, ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. ఆయన దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం ధర చెల్లించాలి. కానీ, ఇందులో రూ.38 లక్షల గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. ఇవేగాక.. నగలు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను ఆయన చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకున్నారనే ఆరోరపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఆయన  జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అటక్‌ జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను ఆయన న్యాయవాది నయీమ్‌ హైదర్‌ సోమవారం కలిశారు.  జైలులో పరిస్థితులపై ఇమ్రాన్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు నయీమ్‌ తెలిపారు. ‘‘ఓ చిన్న చీకటిగదిలో నన్ను ఉంచారు.  పగలు ఈగల బాధ, రాత్రి చీమల బెడద ఎక్కువగా ఉంది. నన్నో ఉగ్రవాదిగా చూస్తున్నారు’’ అని ఇమ్రాన్‌ చెప్పినట్లు న్యాయవాది వెల్లడించారు.

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ బుధవారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో తోషాఖానాపై నిర్ణయం వెలువడటం గమనార్హం. నేడు ఆయన అన్ని పార్టీలతో సమావేశమై నేషనల్‌ అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని