WHO: ‘అలా జరిగితే ఈ ఏడాదిలో కొవిడ్‌ తీవ్ర దశ ముగుస్తుంది’

రెండేళ్లుగా కొత్త కొత్త వేరియంట్లతో కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్‌ విజృంభణ తగ్గుముఖం పడుతుండగా.. కరోనా వైరస్‌ ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల హెచ్చరించింది. అయితే, ప్రపంచ జనాభాలో...

Published : 13 Feb 2022 01:18 IST

కేప్‌ టౌన్‌: రెండేళ్లుగా కొత్త కొత్త వేరియంట్లతో కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్‌ విజృంభణ తగ్గుముఖం పడుతుండగా.. కరోనా వైరస్‌ ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల హెచ్చరించింది. అయితే, ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే మహమ్మారి తీవ్రమైన దశ ఈ ఏడాదిలో ముగుస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తాజాగా వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న అధనామ్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది జూన్, జూలై మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి టీకాలు పూర్తయితే.. సంవత్సరాంతానికి మహమ్మారి తీవ్రమైన దశ ముగుస్తుందని అంచనా. మనం ఆశించేది ఇదే. అంతా మన చేతుల్లోనే ఉంది’ అని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు కేవలం 11 శాతం మందికి మాత్రమే కొవిడ్‌ టీకా పూర్తయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ రేటు కావడం గమనార్హం. స్థానికంగా 70 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుత టీకాల వేగాన్ని ఆరు రెట్లు పెంచాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ క్రమంలోనే మోడెర్నా సీక్వెన్స్‌ను ఉపయోగించి ఆఫ్రికాలో మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను రూపొందించిన ‘ఆఫ్రిజెన్ బయోలాజిక్స్, వ్యాక్సిన్‌’ కేంద్రాన్ని అధనామ్‌తోపాటు డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్తలు సందర్శించారు. డబ్ల్యూహెచ్‌ఓ, కొవాక్స్‌ సహకారంతో ఆఫ్రిజెన్‌.. ఈ ప్రాజెక్టు చేపడుతోంది. 2024లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కువ ధర, స్వల్ప జాగ్రత్తలతో నిల్వ చేయాల్సివచ్చే సందర్భాల్లో ఈ టీకా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు అధనామ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని