American Bully: బ్రిటన్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘అమెరికన్‌ బుల్లీ’..! నిషేధానికి సునాక్‌ సిద్ధం

తమ దేశంలో అమెరికన్‌ బుల్లీ జాతి శునకాన్ని నిషేధించనున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) వెల్లడించారు.

Published : 15 Sep 2023 19:59 IST

లండన్‌: ఓ అమెరికన్‌ జాతి శునకం బ్రిటన్‌ను బెంబేలిస్తోంది! కొంతకాలంగా స్థానికంగా ‘అమెరికన్‌ బుల్లీ’ (American xl Bully) జాతి శునకం దాడులు ఎక్కువైనట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవడాన్ని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే తమ దేశంలో అమెరికన్‌ బుల్లీ జాతి శునకాన్ని నిషేధించనున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనిపై నిషేధం అమలు చేస్తామన్నారు.

‘‘అమెరికన్‌ ఎక్స్‌ఎల్‌ బుల్లీ’ జాతి శునకాలు మన ప్రాంతంలో అత్యంత ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా చిన్నారులకు. ఇటీవల జరిగిన దాడికి సంబంధించిన భయానక పరిస్థితిని మనమందరం చూశాం. గురువారం కూడా అమెరికన్‌ ఎక్స్‌ఎల్‌ బుల్లీ జాతి శునకం ఓ వ్యక్తిపై దాడి చేసి, తీవ్ర గాయాలకు కారణమయ్యింది. ఈ తరహా దాడుల ధోరణి కొన్ని శునకాలకే పరిమితం కాదని స్పష్టమవుతోంది’ అని రిషి సునాక్‌ పేర్కొన్నారు. తమ కుక్కలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత వాటి యజమానులకే ఉన్నప్పటికీ.. ఈ తరహా దాడులకు అడ్డుకట్ట వేసి, పౌరులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Rishi Sunak: ‘హిందువు’గా గర్విస్తున్నా.. ‘ఖలిస్థానీ’ పేరుతో హింసను సహించను!

బ్రిటన్‌లో 2021 నుంచి ఇప్పటివరకు శునకాల దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఓ 11 ఏళ్ల చిన్నారి చనిపోగా.. తాజాగా ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇలా వరుస దాడులకు పాల్పడుతోన్న శునకాల జాతులను నిర్వచించి, ఆ సమాచారాన్ని ఇవ్వాలని తన మంత్రులకు చెప్పినట్లు బ్రిటన్ పీఎం రిషి సునాక్ వెల్లడించారు. తద్వారా ‘ప్రమాదకర శునకాల’ కింద ఈ ఏడాది చివరినాటికి వాటిని నిషేధించవచ్చని అన్నారు. శునకాల దాడులు ఎక్కువవుతోన్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రజలకు భరోసా కల్పిస్తూ రిషి సునాక్‌ ఓ వీడియో విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని