Rishi Sunak: ‘హిందువు’గా గర్విస్తున్నా.. ‘ఖలిస్థానీ’ పేరుతో హింసను సహించను!

హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని.. ఖలిస్థానీ తీవ్రవాదం అంశాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి బ్రిటన్‌ పనిచేస్తోందని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) పేర్కొన్నారు.

Published : 08 Sep 2023 20:05 IST

దిల్లీ: ఖలిస్థానీ తీవ్రవాదం అంశాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి బ్రిటన్‌ పనిచేస్తోందని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్న ఆయన.. ఈ ముప్పుకు ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరించుకుంటున్నాయన్నారు. జీ20 సదస్సులో (G20 Summit) పాల్గొనేందుకు భారత్‌ చేరుకున్న ఆయన.. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖలిస్థానీతోపాటు భారత్‌-బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందం, హిందుత్వ, తదితర అంశాలపై మాట్లాడారు.

‘తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్న వాటికి బ్రిటన్‌లో తావులేదు. అందుకే ఖలిస్థానీ (Khalistan) మద్దతుదారుల అంశాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల బ్రిటన్‌ భద్రతా మంత్రి భారత్‌లో పర్యటించారు. కీలక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ తరహా హింసను అంతం చేసేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్‌లో దాన్ని నేను సహించను’ అని ఖలిస్థానీ మద్దతుదారుల హింసపై రిషి సునాక్‌ ఘాటుగా స్పందించారు.

హిందువుగా గర్విస్తున్నా..

‘హిందువుగా నేను గర్విస్తున్నా. నేను అలాగే పెరిగాను. అలాగే ఉన్నాను. ఆలయాలకు వెళ్తాను. ఇటీవలే రక్షాబంధన్‌ చేసుకున్నాం. భారత్‌కు రావడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకమైన విషయం. నా కుటుంబీకులకు చెందిన భారత్‌ అంటే నాకు అమితమైన ప్రేమ. యూకే ప్రధాని బాధ్యతల్లో ఇక్కడకు వచ్చాను. భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పచుకునే మార్గాలు కనుగొనడం, ఇక్కడ నిర్వహిస్తోన్న జీ20 సదస్సును విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది’ అని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన దేశం జీ20 సదస్సు నిర్వహిస్తోందంటూ భారత్‌ను ప్రశంసించారు.

భారత అల్లుణ్ని.. ఈ పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే: రిషి సునాక్‌

ఇదిలాఉంటే, లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంపై ఖలిస్థానీ వాదులు ఈ ఏడాది మార్చిలో దాడిచేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆదేశ భద్రతా మంత్రి కూడా దీనిపై ప్రధానంగా చర్చలు జరిపారు. అనంతరం తీవ్రవాదంపై కలసికట్టు పోరుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన బ్రిటన్‌.. అక్కడ ఖలిస్థానీ తీవ్రవాదం నిరోధానికి ప్రత్యేకంగా 95,000 పౌండ్లు(కోటి రూపాయలు) కూడా కేటాయిస్తున్నట్లు ఆగస్టులో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని