Cancer Vaccine: క్యాన్సర్‌కి రష్యా వ్యాక్సిన్లు.. టీకా తయారీ కీలకదశలో ఉన్నామన్న పుతిన్‌!

రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కి వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు.

Updated : 15 Feb 2024 18:42 IST

మాస్కో: క్యాన్సర్‌కి రష్యా (Russia) శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ (Cancer Vaccine) తయారు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) తెలిపారు. ప్రస్తుతం టీకా తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.  మాస్కోలో భవిష్యత్తు టెక్నాలజీలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘క్యాన్సర్‌ వ్యాక్సిన్‌, రోగనిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నాం. రాబోయే రోజుల్లో వీటిని చికిత్సల్లో ఉపయోగిస్తారని ఆశిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాక్సిన్‌ ఏ విధమైన క్యాన్సర్లను నయం చేస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇప్పటికే పలు దేశాలు వివిధ రకాల క్యాన్సర్‌లకు టీకాలను తయారు చేస్తున్నాయి. బ్రిటన్‌ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ అనే సంస్థతో క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ కోసం ఒప్పందం చేసుకుంది. 2030 నాటికి పదివేల మంది రోగులకు దీన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం పలు రకాల క్యాన్సర్లకు కారణమయ్యే హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ (HPV) కట్టడికి, కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే హెపటైటిస్‌-బి నివారణకు అవసరమయ్యే ఆరు వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయి.

భారత వైద్య పరిశోధన మండలి (ICMR) గణాంకాల ప్రకారం దేశంలో 2026 నాటికి 20 లక్షల మంది దీని బారిన పడే అవకాశం ఉందని అంచనా. భారత్‌లో 2019లోనే 12 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా, 9.3 లక్షల మంది మరణించారని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. రష్యా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే.. భారత్‌లో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని