Ukraine war: 270 రోజుల్లో ఉక్రెయిన్‌పై 4,700 క్షిపణులు..!

యుద్ధం మొదలైన తొమ్మిది నెలల్లో తమ దేశంపై క్షిపణుల వర్షం కురిసిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. పలు శాంతి ప్రతిపాదనలను ఆయన వెల్లడించారు.

Updated : 21 Nov 2022 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యుద్ధం మొదలైన తొమ్మిది నెలల్లో రష్యా దాదాపు వేలకొద్దీ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీనే స్వయంగా వెల్లడించారు. ఆయన ఆదివారం అంతర్జాతీయ సంస్థ లా ఫ్రాంకోఫోని సభ్యులతో మాట్లాడుతూ ‘‘ఈ రోజుతో యుద్ధం మొదలై 270 రోజులవుతుంది. రష్యా 4,700 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. వందల కొద్దీ ఉక్రెయిన్‌ నగరాలు ధ్వంసమయ్యాయి. వేల మంది ప్రజలు మరణించారు. లక్షల మంది బలవంతంగా వలసపోయారు’’ అని వెల్లడించారు. 

ఉక్రెయిన్‌ శాంతి ప్రతిపాదనలను కూడా జెలెన్‌స్కీ తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌ చాలా స్పష్టంగా ఉంది. అందులోని ప్రతి అంశంపై బాగా కసరత్తు చేశాం. రేడియేషన్‌, అణు సురక్షిత, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఖైదీల విడుదల, ఐరాస నియమావళిని అమలు చేసి ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారాన్ని తిరిగి కల్పించడం, బలగాలను ఉపసంహరించి ఉద్రిక్తతలను తగ్గించడం, న్యాయాన్ని పునరుద్ధరించడం, పర్యావరణ హాని నివారించడం, యుద్ధానికి ముగింపు నిర్ణయించడం’’ వంటివి ఉన్నాయని వెల్లడించారు. 

ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు కర్మాగారం లక్ష్యంగా మళ్లీ దాడులు మొదలయ్యాయి. శని, ఆదివారాల్లో ఈ కేంద్రానికి సమీపంలో శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి.  రష్యా బలగాలే ఈ దాడులకు పాల్పడుతున్నాయని ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ దేశంలోని పవర్‌ గ్రిడ్‌, ఇతర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల శీతాకాలంలో చాలా ఇబ్బందులు తలెత్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని