ISS: అమెరికా వ్యోమగామిని అంతరిక్షంలో వదిలేయం..: రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలతో ముప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష

Published : 15 Mar 2022 16:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలతో ముప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంలో తమ సహకారాన్ని నిలిపివేస్తామని రష్యా అంతరిక్ష సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అమెరికా, రష్యా మధ్య అంతరిక్ష పరంగానూ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఐఎస్‌ఎస్‌ నిర్వహణలో అమెరికా, రష్యాలు కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఉన్న అమెరికా వ్యోమగామి మార్క్‌ వాండె హెయ్‌ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన రష్యా వ్యోమనౌకలో భూమికి తిరిగి రావాల్సి ఉండటమే ఇందుకు కారణం.  అయితే అమెరికా, రష్యా మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఈ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. 

ఈ నేపథ్యంలో.. తమ దేశంపై విధించిన ఆంక్షలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా.. ఐఎస్‌ఎస్‌ నుంచి రావాల్సిన అమెరికా వ్యోమగామిని అక్కడే వదిలేస్తామని రష్యా బెదిరింపులకు పాల్పడుతోందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను రష్యా అంతరిక్ష సంస్థ కొట్టిపారేసింది. నిర్దేశించిన ప్రణాళిక ప్రకారమే.. అమెరికా వ్యోమగామిని భూమిపైకి సురక్షితంగా తీసుకువస్తామని ‘రోస్‌కాస్మోస్‌‌’ వెల్లడించింది. మరోవైపు మార్క్‌ ప్రయాణాన్ని వాయిదా వేయడంలేదని అటు నాసా కూడా పేర్కొంది.

మార్క్‌ వాండె.. ఏప్రిల్‌ 2021 నుంచి ఐఎస్‌ఎస్‌లో ఉంటున్నారు. ఏకబిగిన 340 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన అమెరికన్‌గా ఆయన మంగళవారం రికార్డు సృష్టించనున్నారు. ఈ నెల 30న ఆయన రష్యాకు చెందిన సోయజ్‌ వ్యోమనౌకలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అప్పటికి ఆయన 355 రోజుల పాటు భూ కక్ష్యలో గడిపినట్లవుతుంది. ఈ అంశంలో ప్రపంచ రికార్డు (438 రోజులు) రష్యా పేరిట ఉంది. మార్క్‌ వాండె.. కజకిస్థాన్‌లో దిగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని