Zelenskyy: పూర్తిస్థాయిలో బలహీనంగా రష్యా.. ఎంత ఆలస్యమైతే అంత నాశనం!

రష్యాలో ‘వాగ్నర్‌’ తిరుగుబాటుపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. చెడు మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ తమను తామే నాశనం చేసుకుంటారని పేర్కొన్నారు.

Updated : 24 Jun 2023 19:04 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ (Ukraine)పై సైనిక చర్య కొనసాగిస్తోన్న రష్యా (Russia)కు.. అదే యుద్ధంలో సహకరించిన వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటు (Wagner Mutiny) రూపంలో షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత లబ్ధి కోసమే వాగ్నర్ చీఫ్‌ ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) రష్యాకు ద్రోహం చేస్తున్నాడని పుతిన్‌ (Putin) ఇప్పటికే మండిపడ్డారు. మరోవైపు.. రష్యాలో జరుగుతోన్న పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) కీలక వ్యాఖ్యలు చేశారు. చెడు మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ తమను తామే నాశనం చేసుకుంటారని పేర్కొన్నారు.

‘చాలాకాలంగా రష్యా తన బలహీనతను, ప్రభుత్వ మూర్ఖత్వాన్ని కప్పిపుచ్చింది. ఇప్పుడు ఏం దాచిపెట్టలేని విధంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనంతటికి ఒక వ్యక్తే కారణం. పూర్తి స్థాయిలో రష్యా బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. మాస్కో తన బలగాలను, కిరాయి సైన్యాలను ఉక్రెయిన్‌లో ఎంత ఎక్కువ కాలం ఉంచుతుందో.. అంత ఎక్కువ నష్టాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. తాము పూర్తి సామర్థ్యంలో, ఐకమత్యంగా ముందుకు సాగుతామని.. మున్ముందు ఏం చేయాలో తమ బలగాలకు తెలుసని ట్వీట్‌ చేశారు.

‘రష్యా చాలా బలమైన దేశమంటూ చెప్పిన వారు.. ఇప్పుడు చూడండి.. ఏం జరిగిందో’ అంటూ ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు. రష్యా విషయంలో తటస్థ వైఖరి, భయాందోళనలు వీడాల్సిన సమయం వచ్చిందని పేర్కొంటూ.. ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు అందజేయాలని ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. మాస్కో వైపు దూసుకొస్తున్న వాగ్నర్‌ దళాలు వొరొనెజ్‌ నగరం దాటాయి. వారిని నిలువరించేందుకు రష్యా దాడులకు దిగుతోంది. మార్గమధ్యలో ఉన్న లిప్‌స్టెక్‌ ప్రాంతవాసులు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని