Hirokazu Tanaka: 178 మంది ఒకే పేరుగల వ్యక్తులు.. ఒకే చోట..!

అచ్చు మన పేరే కలిగి ఉన్న వ్యక్తులు ఇద్దరో ముగ్గురో మనకు ఎదురవుతుంటారు. కానీ.. ఏకంగా 170కిపైగా ఒకే పేరు గల వ్యక్తులు ఒకచోట కలవడం చూశారా! జపాన్‌లో ఈ అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. ‘హిరోకాజు తనకా’ అనే పేరు గల 178 మంది శనివారం ఒకేచోట చేరారు.

Published : 30 Oct 2022 01:32 IST

టోక్యో: మన పేరుతో  ఉన్న వ్యక్తులు ఇద్దరో ముగ్గురో మనకు ఎదురవుతుంటారు. కానీ.. ఏకంగా 170కిపైగా ఒకే పేరు గల వ్యక్తులు ఒకచోట కలవడం చూశారా! జపాన్‌(Japan) రాజధాని టోక్యోలో ఈ అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. ‘హిరోకాజు తనకా(Hirokazu Tanaka)’ అనే పేరు గల 178 మంది శనివారం ఒకేచోట చేరారు. ఈ క్రమంలోనే.. 2005లో న్యూయార్క్‌లో 164 మంది ‘మార్తా స్టీవర్ట్‌’ల పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

ఈ 178 మందిలో మూడేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు. ఈ ఆత్మీయ కలయిక కోసం ఒకరు వియత్నాంలోని హనోయి నుంచి జపాన్‌కు రావడం గమనార్హం. తమ పేరు, నంబర్‌తో ఉన్న టీ షర్టులు ధరించి.. గిన్నిస్ నిబంధనల ప్రకారం అయిదు నిమిషాలపాటు ఓ థియేటర్‌లో కూర్చున్నారు. దీంతో గిన్నిస్‌ అధికారి ఈ సరికొత్త రికార్డును ప్రకటించారు. అయితే.. దీని సాధన వెనుక రెండు విఫలయత్నాలూ ఉన్నాయి. చివరిసారి 2017లో 87 మంది మాత్రమే కలిశారు. ఎట్టకేలకు పాత రికార్డును అధిగమించారు.

ఈ రికార్డు వెనుక 53 ఏళ్ల హిరోకాజు తనకా ఏళ్లనాటి పట్టుదల దాగి ఉంది. 1994లో తన పేరే కలిగి ఉన్న ఓ బేస్‌బాల్ క్రీడాకారుడిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటివరకు సాదాసీదాగా ఉందని భావించిన తన పేరు.. ఓ ప్రముఖ వ్యక్తికీ ఉందని తెలిసి సంతోషంలో మునిగిపోయారు. అప్పటినుంచి తన పేరుతో ఉన్న వ్యక్తుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ‘హిరోకాజు తనకా’ పేరిట ఉద్యమాన్నే ప్రారంభించారు. ఒక్కొక్కరుగా.. ఈ పేర్ల కుటుంబం విస్తరించింది. గతంలో అంతా కలిసి ఒక పాటనూ విడుదల చేశారు.

అయితే, ఇంతమంది ఒకేచోట ఉంటే పరస్పరం ఎలా పిలుచుకుంటారని ఆలోచిస్తున్నారా? ఈ సమస్యకూ వినూత్న పరిష్కారం కనుగొన్నారు. ప్రతి వ్యక్తికి.. వారి అభిరుచులు, వృత్తి లేదా ఇష్టమైన ఆహారం పేరిట మారుపేరును కేటాయించారు. సన్ గ్లాసెస్, చూయింగ్ గమ్, మినీ వ్యాన్‌ ఇలా ఒక్కొక్కరికి ఒక్కోపేరు. 53 ఏళ్ల తనకాను సెమీ లీడర్‌ అని పిలుస్తారు. ‘ఎట్టకేలకు నా కల నెరవేరింది. ఇది మా అందరి పిచ్చితనానికి ఉదాహరణ’ అని ఆయన సరదాగా పేర్కొన్నారు. ‘పేరు మీదే గిన్నిస్‌ రికార్డు దక్కడం విచిత్రమైన అనుభూతి. నా తల్లిదండ్రులకు కృతజ్ఞుడిని’ అని ‘హాట్‌పాట్‌’ హిరుకాజు తనకా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని