Iran-saudi: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. పాలస్తీనా కోసం సౌదీ-ఇరాన్‌ నేతల ఫోన్‌!

Israel Hamas Conflict: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉద్రిక్తతలపై ఇరాన్‌, సౌదీ అరేబియా దేశాల నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ రెండు దేశాలు దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకుంటున్న వేళ.. ఈ సంభాషణకు ప్రాధాన్యం ఏర్పడింది.

Updated : 12 Oct 2023 13:34 IST

రియాద్‌: హమాస్‌ (Hamas) ఉగ్ర కేంద్రమైన గాజా (Gaza)పై ఇజ్రాయెల్‌ (Israel) భీకర దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధ పరిస్థితులపై ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ (Ebrahim Raisi), సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్ సల్మాన్‌ (Mohammed bin Salman) ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌, సౌదీ మధ్య కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి ముగింపు పలికేలా ఇటీవల ఈ రెండు దేశాలు చారిత్రక ఒప్పందం చేసుకున్న తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బుధవారం వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. పాలస్తీనా (Palestine)లో యుద్ధ నేరాలకు ముగింపు పలకాల్సిన అవసరంపై రైసీ, సల్మాన్‌ చర్చించినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. ‘‘ఈ యుద్ధాన్ని నిలిపివేసేందుకు సౌదీ రాజ్యం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అన్ని అంతర్జాతీయ, ప్రాంతీయ భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక ప్రజల ప్రాణాలు పోవడాన్ని సౌదీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. పాలస్తీనా ప్రజలకు చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించడం, ఆ ప్రాంతంలో శాంతి స్థాపన చర్యలకు సౌదీ మద్దతిస్తుంది’’ అని యువరాజు ఇరాన్‌ అధినేతకు హామీ ఇచ్చినట్లు సౌదీ అధికారిక మీడియా ప్రకటించింది.

యుద్ధ విస్తరణకు సంకేతమా?

ఇరాన్‌, సౌదీ అరేబియా మధ్య కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలికేలా ఈ ఏడాది మార్చిలో కీలక పరిణామం జరిగింది. చైనా మధ్య వర్తిత్వంతో ఇరు దేశాల మధ్య దౌత్య ఒప్పందం కుదిరింది. పరస్పరం దౌత్య కార్యాలయాలను తెరిచేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం తర్వాత ఇరు దేశాధినేతలు నేరుగా మాట్లాడుకున్నారు. ఇక ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం వేళ పాలస్తీనాకు ఇరాన్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. హమాస్‌ దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉన్నట్లు అంతకుముందు వార్తలు రాగా.. వాటిని టెహ్రాన్‌ ఖండించింది. మరోవైపు అరబ్‌ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా నిన్నటివరకు ఎవరి పక్షం వహించకుండా తటస్థంగా ఉండే ప్రయత్నం చేసింది. తాజాగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులను సౌదీ యువరాజు పరోక్షంగా వ్యతిరేకించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని