Saudi- Israel: సౌదీ కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి బ్రేక్‌!

ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సౌదీ బ్రేక్‌ వేసింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Published : 14 Oct 2023 14:47 IST

రియాద్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అరబ్‌ దేశమైన సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్‌ పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని, ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్లు సమాచారం.

గత కొన్నాళ్లుగా అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 1979లో ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. ఇటీవల కాలంలో యూఏఈ, బహ్రెయిన్‌ దేశాలు ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ఆరంభించింది. యుద్ధానికి ప్రారంభానికి కొద్ది రోజులు ముందు ఇజ్రాయెల్‌- సౌదీ అరేబియా దేశాలు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చాయి. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. సరిగ్గా ఈ ప్రయత్నమే.. గాజా-ఇజ్రాయెల్‌ మధ్య తాజా యుద్ధానికి కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

‘హమాస్‌.. అల్‌ఖైదా మాదిరిగానే’: జో బైడెన్‌

అరబ్‌లీగ్‌లో బలమైన దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇతర దేశాలూ సౌదీ బాట పట్టే అవకాశం ఉంది. సాధారణంగా పాలస్తీనా సమస్య.. అరబ్‌ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌ విషయంలో ఇన్నాళ్లూ కఠిన వైఖరినే అవలంబిస్తూ వచ్చాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. అలాంటి దేశాలు యూదు దేశంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల పాలస్తీనీయుల హక్కులకు వెన్నుపోటు పొడవడమే అవుతుందని ఇరాన్‌ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఒప్పందం విషయంలో ముందడుగు పడడం కష్టమని అందరూ ఊహించనట్లుగానే సౌదీ వెనక్కి తగ్గడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని