Sri Lanka: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ‘రాజపక్స’ సోదరులే కారణం: సుప్రీంకోర్టు

దేశంలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి రాజపక్స సోదరులే కారణమని శ్రీలంక సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

Published : 14 Nov 2023 22:53 IST

కొలంబో: గతేడాది ఏప్రిల్‌లో శ్రీలంక ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దేశంలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి రాజపక్స సోదరులే కారణమని తేల్చి చెప్పింది. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Gotabaya Rajapaksa), మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్స (Mahinda Rajapaksa), మాజీ ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్స (Basil Rajapaksa)తోపాటు ఇతర సీనియర్‌ అధికారులు కలిసి ఆర్థిక వ్యవస్థను తప్పుదోవ పట్టించి సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని పేర్కొంది. తద్వారా ఊహించని ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారని వ్యాఖ్యానించింది.

దేశం ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారంటూ ట్రాన్స్ప్‌రెన్సీ ఇంటర్నేషనల్‌తోపాటు మరో నలుగురు సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. 2019-22 మధ్యకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగం కావడానికి మాజీ అధ్యక్షుడు గొటబాయ, మాజీ ప్రధాని మహిందా, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సలే బాధ్యులని తేల్చింది. దీనికి ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల్లో 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది. వీరేకాకుండా శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ అజిత్‌ నివార్డ్‌ కాబ్రాల్‌, డబ్ల్యూడీ లక్ష్మణ్‌, పలువురు మాజీ కార్యదర్శులు కూడా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేల్చింది. 

2019లో 681 బిలియన్‌ రూపాయల (శ్రీలంక కరెన్సీ) పన్ను రాయితీలు ప్రకటించడమే ఈ సంక్షోభానికి మూల కారణమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. వీరంతా పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రకటించాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి పరిహారాన్ని ఆదేశించడంలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లకు రూ.1,50,000 చెల్లించాలని ఆదేశించింది.

ఎట్టకేలకు గద్దె దిగిన మహీంద.. శ్రీలంక సంక్షోభం ఇలా మొదలైంది..!

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. ఏప్రిల్‌ 2022లో ఆర్థికంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోవడంతో.. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన పరిస్థితులను చవిచూసింది. దాంతో దేశప్రజలు వీధుల్లోకి వచ్చి చేసిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఏకంగా అధ్యక్ష భవనంతోపాటు ప్రధాని నివాసంపైనా ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో మాల్దీవులకు పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు.  తొలుత మే 2022లో మహిందా రాజపక్స రాజీనామా చేయగా.. మే నెలలో గొటబాయ కూడా పదవిని వీడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని