Smartphone: మీ ఫోనే ఇక థర్మా మీటర్‌.. కొత్త యాప్‌ వస్తోంది!

మనిషి శరీర ఉష్ణోగ్రతలను కొలిచేందుకు కొత్తగా ఓ మొబైల్‌ యాప్‌ను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ దశలో ఉంది.

Published : 24 Jun 2023 20:37 IST

Image source: university of washington

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ఫోన్‌ కాల్స్‌కే పరిమితమైన ఫోన్‌.. ఇప్పుడు మనం నిత్యం వాడే ఎన్నో గ్యాడ్జెట్స్‌ను రీప్లేస్‌ చేసేసింది. ఇప్పుడు వాచ్‌ చూడాలన్నా స్మార్ట్‌ఫోనే.. అలారమ్‌ మోగాలన్నా స్మార్ట్‌ఫోనే.. వినోదం కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌నే చూడాల్సిన పరిస్థితి. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) జ్వరాన్ని కొలిచేందుకు ఉపయోగించే థర్మామీటర్‌ (thermometer) అవతారాన్నీ ఎత్తనుంది. దీనికి సంబంధించి ఓ యాప్‌ రూపుదిద్దుకుంటోంది.

యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు ఫీవర్‌ యాప్‌ (Fever app) పేరిట ఓ యాప్‌ను రూపొందించే పనిలో పడ్డారు. స్మార్ట్‌ఫోన్‌లోని టచ్‌స్క్రీన్‌, బ్యాటరీ ఉష్ణోగ్రత కొలిచేందుకు ఉపయోగించే సెన్సర్ల సాయంతో మనిషి శరీర ఉష్ణోగ్రతను కొలిచి మెషిన్‌ లెర్నింగ్ సాయంతో ఆ వివరాలను వెలువరించానున్నారు. ఇందుకోసం అదనంగా ఎలాంటి హార్డ్‌వేర్‌ సహకారమూ అవసరం లేదని పరిశోధకులు చెప్తున్నారు. జన బాహుళ్యంలోకి తీసుకురావాలంటే మరింత విస్తృత డేటా అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ యాప్‌ను ఉపయోగించాలంటే అవతలి వ్యక్తి కనీసం స్మార్ట్‌ఫోన్‌ను కూడా తాకనవసరం లేదు. యాప్‌ను ఓపెన్‌ చేసి కెమెరా లెన్స్‌తో రోగి నుదుటిపై 90 సెకన్ల పాటు ఉంచితే సరిపోతుంది. ఈ యాప్‌ను 37 మంది రోగులపై ప్రయోగించినప్పుడు ప్రాథమిక దశలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. థర్మామీటర్‌తో పోలిస్తే సగటున 0.23 డిగ్రీల సెల్సియస్‌ ఎర్రర్‌ చూపిస్తోందని తెలిపారు. ఇది క్లినికల్‌గా ఆమోదించిన రేంజ్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. కావాల్సిన మెడికల్‌ క్లియరెన్సులన్నీ పూర్తయితే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని