USA: ఆస్ట్రేలియాలో కూలిన అమెరికా సైనిక హెలికాప్టర్‌.. ముగ్గురు మృతి

అమెరికా నేవీకి చెందిన విమానం ఒకటి ఆస్ట్రేలియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 20 మంది గాయపడ్డారు. మరో ఘటనలో ఉక్రెయిన్‌లో రెండు శిక్షణ విమానాలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  

Published : 27 Aug 2023 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా(Australia)లో జరుగుతున్న యుద్ధ విన్యాసాల్లో అమెరికా(USA)కు చెందిన హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మెరైన్స్‌ మరణించగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాకు చెందిన ఎంవీ-22బీ ఓస్ప్రే ( MV-22B Osprey) హెలికాప్టర్‌ దాదాపు 23 మందితో ఆస్ట్రేలియాలోని ఉత్తర డార్విన్‌ ప్రాంతంలోని తివి ద్వీపం వద్ద వెళుతుండగా కూలిపోయింది. ఈ ఘటన మాల్విల్‌ ద్వీపం వద్ద చోటు చేసుకొంది. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ‘ప్రిడేటర్‌ రన్‌’ పేరిట యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఫిలిప్పీన్స్‌, ఈస్ట్‌ తైమూర్‌, ఇండోనేషియాకు చెందిన 2,500 సైనికులు దీనిలో పాల్గొన్నారు. ‘‘ఈ విమానంలోని మెరైన్లు యుద్ధ విన్యాసాల పనుల కోసం వెళుతున్నారు. ప్రస్తుతం శకలాలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించేపనిలో ఉన్నాం’’ అని డార్విన్‌ రొటేషనల్‌ ఫోర్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఆదివారం ఉదయం అమెరికా మెరైన్‌ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే హెలికాప్టర్లు డార్విన్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం  హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి. 2022లో ఈ రకం హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మెరైన్స్‌ చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా రెండు కూలిపోయాయి. 2000వ సంవత్సరం నుంచి దాదాపు 11 హెలికాప్టర్లు కూలిపోయాయి.

రెండు విమానాలు విమానాలు ఢీకొని..

ఉక్రెయిన్‌కు అందించనున్న ఎఫ్‌-16 యుద్ధ విమానాల కోసం పైలట్లకు ఇస్తున్న శిక్షణలో అపశ్రుతి చోటు చేసుకొంది. రెండు శిక్షణ విమానాలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఉక్రెయిన్‌ ఏస్‌ పైలట్‌ ఆండ్రీ పిల్షికోవ్‌ కూడా ఉన్నాడు. ఉత్తర ఉక్రెయిన్‌లో ఎల్‌-39 యుద్ధ విమానాలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఆండ్రీ మృతి ఉక్రెయిన్‌కు తీరని లోటని ఆ దేశ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. 

విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ముగ్గురి మరణాన్ని ధ్రువీకరించారు. కీవ్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. విమానాలు గాల్లోకి ఎగిరేందుకు అవసరమైన నిబంధనలు సరిగ్గా పాటించలేదనే అనుమానాలున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదం ఉక్రెయిన్‌ పైలట్లకు ఎఫ్‌-16ల శిక్షణలో మరిన్ని సమస్యలను సృష్టించనుంది.  ఉక్రెయిన్‌ పైలట్లకు ఇంగ్లిష్‌ భాషలో శిక్షణను సెప్టెంబర్‌ నుంచి మొదలుపెట్టినున్నట్లు గురువారం పెంటగాన్‌ ప్రకటించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని