Trump: మూడో ప్రపంచయుద్ధం అంచున ఉన్నాం : ట్రంప్‌ హెచ్చరిక

బైడెన్‌ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. మనం మూడో ప్రపంచ యుద్ధం (World War III) అంచున ఉన్నామని హెచ్చరించారు.

Updated : 29 Jan 2024 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జోర్డాన్‌లోని తమ దేశ సైనిక స్థావరంపై డ్రోన్‌ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. వీటికి దీటుగా స్పందిస్తామని అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఇప్పటికే హెచ్చరించారు. ఈ పరిణామాలపై స్పందించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. అగ్రరాజ్యానికి ఇదో భయంకరమైన రోజు అన్నారు. బైడెన్‌ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. అమెరికా బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. మనం మూడో ప్రపంచ యుద్ధం (World War III) అంచున ఉన్నామని హెచ్చరించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఇటువంటి ఘటనలు చోటుచేసుకునేవి కాదన్నారు.

‘బైడెన్‌ ప్రభుత్వ బలహీనత కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. నేను అధ్యక్షుడిగా ఉంటే ఇటువంటిది సంభవించే అవకాశమే లేకపోయేది. ఉక్రెయిన్‌ యుద్ధం కూడా జరిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనేది. దీనికి విరుద్ధంగా.. ప్రస్తుతం మనం మూడో ప్రపంచ యుద్ధం (World War III) అంచున ఉన్నాం’ అని సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌’లో డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తాను పదవి నుంచి దిగిపోయే సమయానికి ఇరాన్‌ చాలా బలహీనంగా ఉండేదన్నారు. కానీ, బైడెన్‌ వచ్చిన తర్వాత ఆ దేశానికి వేలకోట్ల డాలర్లు వెళ్తున్నాయని, తద్వారా మధ్యప్రాచ్యంలో రక్తపాతానికి కారణమవుతోందని ఆరోపించారు.

ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను బైడెన్‌ ప్రభుత్వం తిప్పికొట్టింది. జాతీయ భద్రతను రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోన్న వారి మాటలు అశాస్త్రీయంగా ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా ఇటువంటివి దేశ భద్రతకు హానికరమని పేర్కొంది. ఇదిలాఉంటే, సిరియా సరిహద్దులోని ఈశాన్య జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. 34 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్‌ మద్దతున్న మిలిటెంట్‌ గ్రూపులు ఈ దాడికి పాల్పడినట్లు అమెరికా భావిస్తోంది. వీటిని ఖండించిన ఇరాన్‌.. ఇందులో తమ ప్రమేయం లేదని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని