Ukraine Crisis: యుద్ధ సంక్షోభం.. ప్రధాని మోదీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఫోన్‌

ఒకవైపు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ప్రతిఘటిస్తూనే.. సైనిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయా దేశాల మద్దతు కోరుతున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా రష్యా దూకుడును...

Updated : 27 Feb 2022 05:36 IST

కీవ్‌: ఒకవైపు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ప్రతిఘటిస్తూనే.. సైనిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయా దేశాల మద్దతు కోరుతున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా రష్యా దూకుడును కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు చెప్పారు. ‘రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతున్న తీరును భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లా. లక్ష కంటే ఎక్కువ మంది రష్యా సైనికులు ప్రస్తుతం మా దేశంలో ఉన్నారు. వారు నివాస భవనాలపై కాల్పులు జరుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఐరాస భద్రతామండలి మాకు రాజకీయ మద్దతు ఇవ్వాలని భారత్‌కు విజ్ఞప్తి చేశా’ అని జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ నేడు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జెలెన్‌ స్కీ.. ప్రధాని మోదీతో సంభాషించడం గమనార్హం. మరోవైపు.. సైనిక చర్యలో భాగంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. ‘రష్యన్ సేనల ప్రణాళికను మేం విఫలం చేశాం. కీవ్‌ ఇప్పటికీ ఉక్రెయిన్‌ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రధాన నగరాలు కూడా మాతోనే ఉన్నాయి’ అని తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. దీంతోపాటు స్విట్జర్లాండ్‌, గ్రీస్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల నేతలు ఫోన్లు చేసి తనకు మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. అంతేగాకుండా స్విఫ్ట్‌ నుంచి రష్యాను డిస్‌కనెక్ట్‌ చేసేందుకు ఈయూ దేశాల నుంచి పూర్తి మద్దతు లభించిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని