Nuclear Suppliers Group: ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం.. భారత్‌కు అమెరికా మద్దతు

న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌లో (NSG) భారత్‌ సభ్యత్వానికి మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది. భావసారూప్య భాగస్వాములతో ఈ విషయంలో కలిసి వెళ్తామని పేర్కొంది.

Published : 24 Jun 2023 18:27 IST

వాషింగ్టన్‌: అణు సరఫరాదారుల సమూహం (న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌-NSG)లో భారత్‌ చేరేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా (USA) పునరుద్ఘాటించింది. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన భాగస్వాములతో కలిసి వెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత అమెరికా తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమావేశం అనంతరం ఇరుదేశాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే కర్బన ఉద్ఘారాలను తగ్గించే ప్రయత్నాల్లో అణుశక్తి పోషించే ముఖ్యపాత్రను నొక్కి చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్‌లో ఇంధన అవసరాలను పరిష్కరించేందుకు, వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు అణుశక్తిని ఓ వనరుగా పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు ప్రాజెక్టు కోసం టెక్నో-కమర్షియల్‌ ఆఫర్‌ను అభివృద్ధి చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీకి అవకాశాలను సులభతరం చేసేందుకు ఇరు దేశాలు స్వాగతించాయి. అంతేకాకుండా ఈ విషయంలో అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ (యూఎస్‌ డీఓఈ), భారత్‌లోని అణుశక్తి విభాగం(DAE) మధ్య సంప్రదింపులను ఇరుదేశాల నేతలు అభినందించారు. రానున్న కాలంలో దేశీయ వినియోగం, ఎగుమతి కోసం సహకార పద్ధతిలో చిన్న తరహా అణు రియాక్టర్‌ టెక్నాలజీ అభివృద్ధి అంశాన్ని కూడా గుర్తించినట్లు మోదీ, బైడెన్‌ తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే  అణుసరఫరాదారుల సమూహంలో భారత్‌కు తన మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.

అసలేంటీ ఎన్‌ఎస్‌జీ?

అణుశక్తిని సరఫరా చేసే దేశాల సమూహమే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG). ఇది అణు సంబంధిత ఎగుమతుల కోసం మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడానికి దోహదం చేస్తుంది. 1974లో దీనిని ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ మార్గదర్శకాలు వివిధ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీలో అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, మెక్సికో, అర్జెంటీనా, సైప్రస్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, నార్వే తదితర 48 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఎన్‌ఎస్‌జీ కూటమిలో భాగస్వామ్యం కోసం భారత్‌ ప్రయత్నించింది.  చైనా వ్యతిరేకించడంతో ఈ ప్రక్రియలో ముందడుగుపడలేదు. మరోవైపు భారత్‌ సభ్యత్వాన్ని న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రియా దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని