Biden: చైనాతో వివాదాల వేళ.. భారత్‌తో బంధాన్ని పునరుజ్జీవింపజేశాం: బైడెన్‌

Biden: చైనాతో వివాదాల వేళ భారత్‌ వంటి మిత్రదేశాలతో బంధాన్ని పునరుజ్జీవింపజేశామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగంలో గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 08 Mar 2024 12:04 IST

వాషింగ్టన్‌: భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి మిత్రదేశాలతో అమెరికా తన భాగస్వామ్యాన్ని పునరుజ్జీవింపజేసిందని అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) అన్నారు. మరోవైపు చైనా తన అసంబద్ధ ఆర్థిక విధానాలతో ముందుకెళ్తోందని ఆరోపించారు. తైవాన్‌తో ఘర్షణలు పెట్టుకొని శాంతికి విఘాతం కలిగిస్తోందని చెప్పారు. వార్షిక ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌’ ప్రసంగంలో తమ ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తూ గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనాతో (China) తాము పోటీని మాత్రమే కోరుకుంటున్నామని.. వివాదాలు కాదని బైడెన్‌ అన్నారు. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చైనా పురోగమిస్తోందని.. అమెరికా వెనుకబడుతోందని అంటున్నారని తెలిపారు. అందులో వాస్తవం లేదన్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యం కొనసాగుతోందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ జీడీపీ గణనీయంగా పెరిగిందన్నారు. చైనాతో వాణిజ్య లోటు దశాబ్దకాలంలోనే కనిష్ఠానికి చేరిందన్నారు. చైనా ఆయుధాల్లో అమెరికాకు చెందిన అత్యాధునిక సాంకేతికతలు వినియోగించడానికి అనుమతించడం లేదన్నారు. 21 శతాబ్దంలో చైనాతోనే కాకుండా ఇతర దేశంతోనైనా గెలుపొందేందుకు అమెరికా బలంగా ఉందన్నారు.

సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీ ఎన్నికల్లో గెలుపు తర్వాత రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌, డెమోక్రాటిక్‌ నుంచి బైడెన్‌ అధ్యక్ష పీఠం కోసం మరోసారి తలపడడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో తాజా వార్షిక ప్రసంగంలో ట్రంప్‌పై బెడెన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గెలుపు దేశానికి చాలా ప్రమాదమని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని