Jo Lindner: అతడి మరణం.. బాడీ బిల్డర్లకు ఓ హెచ్చరిక..!

ప్రముఖ  ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ జో లిండ్నర్‌ మరణం బాడీ బిల్డింగ్‌లో అనుసరించే వివాదాస్పదమైన పద్దతులను మరోసారి చర్చకు తీసుకొచ్చింది. 

Updated : 02 Jul 2023 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ జో లిండ్నర్‌(30) మరణం అతడి ఫాలోవర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని 85 లక్షల మంది అనుసరిస్తున్నారు. తన ఫిట్‌నెస్‌ వీడియోలతో యూట్యూబ్‌లో దాదాపు 50 కోట్ల వీక్షణలు సొంతం చేసుకొన్నాడు. అతడు మూడు రోజుల క్రితం అరుదైన వ్యాధితో స్నేహితురాలు నిచా సమక్షంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని నిచా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే అతడు తనకు ఓ నెక్లెస్‌ బహూకరించినట్లు పేర్కొంది. అతడు మెడనొప్పితో బాధపడిన మూడు రోజుల్లోనే కన్నుమూశాడని వెల్లడించింది. ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నట్లు పేర్కొంది. లిండ్నర్‌ మరణం బాడీబిల్డింగ్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. దీంతోపాటు శరీర సౌష్ఠవం కోసం అనుసరించే పద్దతులపై మరో సారి చర్చ మొదలైంది.

జో లిండ్నర్‌ సాధారణంగా దుబాయ్‌, థాయిల్యాండ్‌లో ఫిట్‌నెస్‌ వీడియోలను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పోస్టు చేసేవాడు. అవి అతడికి చాలా పేరు తెచ్చిపెట్టాయి. వాస్తవానికి అతడు ‘రిపిలింగ్‌ మజిల్‌ డిసీజ్‌’ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో కండరాలు ఒత్తిడికి గురైన సమయంలో భిన్నంగా స్పందిస్తాయి. సాధారణంగా కండరంపై ఒత్తిడి పెంచితే ఓ రకమైన రసాయనిక చర్య ద్వారా అవి మొత్తం ఒక చోటకు చేరి బలంగా కనిపిస్తాయి. కానీ, రిపిలింగ్‌ మజిల్‌ డిసీజ్‌ ఉన్నవారిలో కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురై ఒకే కండరంలా కాకుండా వేర్వేరుగా అలల వలే కనిపిస్తాయి. ఇలా కనీసం 20 సెకన్ల వరకు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో క్రాంప్‌ ఏర్పడి ఓ గడ్డవలే వచ్చి విపరీతమైన నొప్పికి కారణం కావచ్చు. తనకు ఉన్న ఈ సమస్యను జో లిండ్నర్‌ తరచూ ప్రస్తావించేవాడు. ‘‘గుండె కూడా కండరమే. నా గుండెకు క్రాంప్‌ వస్తే ఎలా అనేదే నా భయం. ఆ ఆలోచనే నన్ను భయపెడుతుంది. అందుకే నేను వీలైనంత ఎక్కువగా బాడీబిల్డింగ్‌ పోటీలకు దూరంగా ఉంటాను’’ అని ఓ సందర్భంలో పేర్కొన్నాడు.

బాడీబిల్డింగ్‌ పోటీల్లో కండరాలను మరింత ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి శరీరంలో నీటిని బయటకు పంపించేస్తుంటారు. ఇందు కోసం ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లేలా ఔషధాలు, స్టెరాయిడ్స్‌ వాడుతుంటారు. జో లిండ్నర్‌ ప్రస్తావించిన క్రాంప్‌ సమస్య ఈ డీహైడ్రేషన్‌ కారణంగానే వస్తుందని ‘మెన్స్‌హెల్త్‌’ పత్రిక కథనంలో పేర్కొంది. 1992లో మహమ్మద్‌ బెనాజీజా అనే బాడీ బిల్డర్‌  కూడా..పోటీల అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. అతడి శరీరం విపరీతంగా నీటిని కోల్పోవడంతో మరణం సంభవించినట్లు శవపరీక్షంలో తేలింది. తాజాగా జో లిండ్నర్‌ మరణానికి కచ్చితమైన కారణం మాత్రం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని