Jaishankar: యూఎస్ మానవ హక్కుల పరిస్థితిపై మాట్లాడేందుకు వెనకాడబోం..!

ఉక్రెయిన్ సంక్షోభం వేళ అమెరికా పర్యటనకు వెళ్లిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జై శంకర్‌.. ప్రతి విషయంలోనూ భారత్ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.

Published : 14 Apr 2022 10:23 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్ సంక్షోభం వేళ అమెరికా పర్యటనకు వెళ్లిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జై శంకర్‌.. ప్రతి విషయంలోనూ భారత్ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. అమెరికాలో మానవహక్కుల పరిస్థితిపై తమకు అభిప్రాయాలుంటాయని, చర్చ జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడేందుకు వెనకాడబోమని తేల్చిచెప్పారు.

వాషింగ్టన్‌లో భారత్‌, అమెరికాకు మధ్య 2+2 స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మాట్లాడుతూ.. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరగడాన్ని గమనించామన్నారు. వీటికి ముగింపు పలికే వరకు ఈ అంశంపై నిరంతరం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతుంటామన్నారు. పర్యటన ముగింపులో భాగంగా దీనిపై  జై శంకర్‌కు అక్కడి భారతీయ పాత్రికేయుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. వారికి ఆయన సమాధానిస్తూ.. తమ మధ్య మానవ హక్కుల ఉల్లంఘన అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. 

‘మానవ హక్కుల ఉల్లంఘనపై మా మధ్య చర్చ జరగలేదు. ఈ సమావేశంలో ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇండో-పసిఫిక్‌ అంశాలు, పాకిస్థాన్‌లో నాయకత్వ మార్పు, శ్రీలంక సంక్షోభం, ప్రపంచ దేశాల ఆహార భద్రత వంటి అంశాలపై చర్చించాం. ఇక ఈ విషయానికొస్తే.. ప్రతి ఒక్కరూ భారత్‌పై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండటానికి అర్హులు. అదే విధంగా వారిపై మేమూ అభిప్రాయాలను కలిగి ఉంటాం. అందుకే ఆ విషయంపై చర్చ జరిగినప్పుడు.. మా అభిప్రాయాలు చెప్పడానికి వెనకాడబోము. అమెరికా సహా ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై మాకు అభిప్రాయాలు ఉంటాయి. ఈ దేశంలో మానవ హక్కుల సమస్య తలెత్తినప్పుడు, అది కూడా మన కమ్యూనిటీకి చెందినప్పుడు మేము వాటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం’ అంటూ భారత్ వైఖరిని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని