Restaurants: ప్రపంచవ్యాప్తంగా 50 బెస్ట్‌ రెస్టారంట్‌లు.. భారతీయ రుచులకూ చోటు!

‘ప్రపంచవ్యాప్తంగా 50 అత్యుత్తమ రెస్టారంట్ల జాబితా- 2023’లో భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన రెండింటికి చోటుదక్కింది. ట్రెసిండ్‌ స్టూడియో (దుబాయి), గగన్‌ ఆనంద్‌ (బ్యాంకాక్‌)లు 11, 17వ స్థానాల్లో నిలిచాయి.

Published : 22 Jun 2023 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ వంటకాల (Indian Cuisine)కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఆయా దేశాల్లో మన రెస్టారంట్లకు ఆదరణ ఎక్కువే! ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచవ్యాప్తంగా 50 అత్యుత్తమ రెస్టారంట్ల (World's 50 Best Restaurants) జాబితా- 2023’లో భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన రెండింటికి చోటుదక్కడం విశేషం. ఎస్‌.పెల్లెగ్రినో, ఆక్వా పన్నాలు స్పాన్సర్ చేసిన ఈ జాబితాను.. పాకరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈ జాబితాలో పెరూ రాజధాని లీమాలోని ‘సెంట్రల్‌’ మొదటి స్థానంలో నిలిచింది. 

మన భారతీయ వంటకాలకు సంబంధించి ట్రెసిండ్‌ స్టూడియో (దుబాయి), గగన్‌ ఆనంద్‌ (బ్యాంకాక్‌)లు 11, 17వ స్థానాల్లో నిలిచాయి. ట్రెసిండ్‌ స్టూడియోను షెఫ్‌ హిమాన్షు సైనీ నిర్వహిస్తున్నారు. ‘అతిథి దేవో భవ’ నినాదంతో ఈ రెస్టారంట్‌.. భారతీయ వంటకాలకు ఫేమస్‌. ఇక్కడి విలక్షణమైన వంటకాలను ఇది హైలైట్ చేస్తుంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల్లో ఇది ‘బెస్ట్‌ రెస్టారంట్‌- 2023’గానూ నిలిచింది.

‘గగన్‌ ఆనంద్’.. బ్యాంకాక్‌లో ఉంది. పసందైన రుచులతో భారతీయ వంటకాలను అందించే ఈ రెస్టారంట్.. రంగులు, సంగీతం, క్రియేటివిటీతో భోజన ప్రియులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తోందని అవార్డుల వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. గతంలో ఈ రెస్టారంట్‌ పలుమార్లు ఆసియాలో బెస్ట్‌గా నిలిచింది. అంతకుముందు మార్చిలో ‘ఆసియాలోని అత్యుత్తమ 50 రెస్టారంట్ల జాబితా- 2023’ను ప్రకటించారు. ఇందులో మస్క్‌ (ముంబయి), ఇండియన్‌ యాక్సెంట్‌ (దిల్లీ), ఆవర్తన (చెన్నై)లు 16, 19, 30వ స్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని