Maldives: ‘భారత్‌కు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలి’: మాల్దీవుల విపక్షం డిమాండ్‌

India-maldives conflict: తమ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు భారత్‌కు క్షమాపణలు చెప్పాలని మాల్దీవుల విపక్ష నేత డిమాండ్ చేశారు. 

Updated : 31 Jan 2024 15:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాల వేళ(India-maldives conflict).. అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు(Mohamed Muizzu)పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఆ దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని విపక్ష నేత ఖాసీం ఇబ్రహీం డిమాండ్ చేశారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తమ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో తాజా డిమాండ్ వచ్చింది.

పొరుగు దేశంతో సంబంధాలు ప్రభావితం అయ్యే విధంగా మాట్లాడకూడదని ఖాసీం అన్నారు.  చైనా పర్యటన అనంతరం చేసిన వ్యాఖ్యలపై ముయిజ్జు భారత ప్రభుత్వానికి, ఆ దేశ ప్రధానికి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇప్పటికే అధ్యక్షుడి విధానాలను విపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంపిక చేసిన మంత్రి మండలిని ఆమోదించేందుకు ఆదివారం సమావేశమైన పార్లమెంటు.. అధికార, విపక్ష ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. దీంతో ఓటింగ్‌ జరగకుండానే సభ ముగిసింది. సోమవారం సమావేశమైన పార్లమెంటు.. ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. మాల్దీవుల(maldives) రాజ్యాంగం ప్రకారం.. ఇక ఆ మంత్రుల పదవులు పోయినట్లే. అదే సమయంలో ముయిజ్జుపైనా అభిశంసన పెట్టేందుకు అవసరమైన సంతకాలను విపక్షాలు సేకరించాయి.

మాల్దీవులకు షాక్‌.. భారీగా తగ్గిన భారత పర్యాటకులు

లక్షద్వీప్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవుల(maldives) మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడంతో వివాదం ముదిరింది. ఆ క్రమంలోనే చైనా పర్యటనకు వెళ్లివచ్చిన ముయిజ్జు.. ‘భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన మమ్మల్ని బెదిరించడం తగదు. దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదు’ అని భారత్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వివాదం.. మాల్దీవుల అభివృద్ధికే చేటు చేస్తుందంటూ విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని