Zelenskyy: మేరియుపొల్‌లో పరిస్థితి అమానవీయం..

మేరియుపొల్‌ నగర ప్రజలను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Published : 18 Apr 2022 02:03 IST

పొరుగుదేశాలతో చర్చలు జరుపుతున్నామన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

కీవ్‌: ‘మాస్క్‌వా’ యుద్ధ నౌక నీట మునిగిన ఘటనతో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంటున్న రష్యా.. ఉక్రెయిన్‌ నగరాలపై మళ్లీ దాడులను ముమ్మరం చేసింది. ముఖ్యంగా కీవ్‌తోపాటు మేరియుపొల్‌ వంటి నగరాలపై క్షిపణి దాడులతో తెగబడుతోంది. ఈ నేపథ్యంలో వేల మంది సామాన్యులు చిక్కుకుపోయిన మేరియుపొల్‌ నగర ప్రజలను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా బ్రిటన్‌, స్వీడన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ముఖ్యంగా రష్యా సేనల దిగ్బంధనంలో ఉన్న మేరియుపొల్‌ను విముక్తి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

‘రష్యా సేనలను ఎదుర్కొవడం లేదా దౌత్యంపైనే మేరియుపోల్‌ ‘విధి’ ఆధారపడి ఉంది. ఉక్రెయిన్‌కు అవసరమైన భారీ ఆయుధాలు, విమానాలను భాగస్వామ్య పక్షాలు ఆలస్యం చేయకుండా తక్షణమే అందిస్తే.. ఈ నగరంపై ఆక్రమణదారుల ఒత్తిడిని తగ్గించగలుగుతాం. తద్వారా దిగ్బంధనాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. లేదంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్న ఆయన.. ఇందులో భాగస్వామ్య పక్షాల పాత్ర నిర్ణయాత్మకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మేరియుపొల్‌లో పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయని.. అక్కడున్న ప్రతి వ్యక్తిని నాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తోపాటు పలు నగరాలపై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. ఖర్కివ్‌, లుహాన్స్క్‌, దినెట్స్క్‌ సహా తూర్పు ప్రాంతాలపై ఫిరంగుల మోత మోగిస్తోంది. ఇటు మేరియుపొల్‌లోనూ హోరాహోరీగా పోరును కొనసాగిస్తోంది. అయితే, ఈ నగరంలో పెద్దఎత్తున మృతదేహాలను పూడ్చేసిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇలా కీవ్‌ నగరం బయట ఇప్పటివరకు దాదాపు 900 మందిని రష్యా సేనలు గురిపెట్టి చంపినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మేరియుపొల్‌లో చిక్కుకుపోయిన వేల మంది పౌరులను రక్షించేందుకు ఉక్రెయిన్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తక్షణమే వీటికి పరిష్కారం చూపకపోతే వేల మంది ప్రాణాలు ఆపదలో చిక్కుకున్నట్లేనని భయాందోళనను వ్యక్తం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని