పార్లమెంటులో అవే ప్రకంపనలు

ప్రధానాంశాలు

పార్లమెంటులో అవే ప్రకంపనలు

‘ప్రభుత్వ గూఢచర్యం’పై చర్చకు విపక్షాల పట్టు
ఉభయ సభల్లో వాయిదాల పర్వం
రాజ్యసభలో తృణమూల్‌ ఎంపీ శాంతను సేన్‌ సస్పెన్షన్‌

దిల్లీ: ‘పెగాసస్‌’ స్పైవేర్‌ అంశంపై పార్లమెంటు శుక్రవారమూ దద్దరిల్లింది. దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. మంత్రి చేతిలోంచి పత్రాలు లాక్కొని, వాటిని చించి గాల్లోకి విసిరిన తృణమూల్‌ ఎంపీ శాంతను సేన్‌ను రాజ్యసభ సస్పెండ్‌ చేసింది. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేవరకూ సేన్‌ సభకు హాజరుకారాదని మూజువాణి ఓటుతో తీర్మానించింది. సభ్యుల నినాదాల నడుమ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

పెద్దల సభ నాలుగు సార్లు వాయిదా

పెగాసస్‌ వ్యవహారంపై గురువారం రాజ్యసభలో మాట్లాడేందుకు ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉపక్రమించగా... తృణమూల్‌ ఎంపీ శాంతను సేన్‌ ఆయన చేతిలోంచి పత్రాలు లాక్కొని, చించి, గాల్లోకి విసరడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత సేన్‌ను సస్పెండ్‌ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో సేన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అయితే, చర్చితాంశాల్లో లేని సేన్‌ సస్పెన్షన్‌ అంశంపై తీర్మానం ఎలా ప్రవేశపెడతారని తృణమూల్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సేన్‌ను మంత్రి బెదిరించిన సంగతేంటని వారు ప్రశ్నించగా, సభలో ఛైర్‌ ముందు జరిగిన విషయాలు మినహా మిగతావాటిని పరిగణనలోకి తీసుకోబోమని వెంకయ్యనాయుడు చెప్పారు. మరోవైపు- పెగాసస్‌పై చర్చ చేపట్టాల్సిందేనని కాంగ్రెస్‌, ఇతర విపక్షాల సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ సభ 12.30కు వాయిదా పడింది. సభ మళ్లీ సమావేశమైనా, సేన్‌ బయటకు వెళ్లలేదు. దీంతో సభ నుంచి వెళ్లిపోవాలని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఆయన్ను కోరారు. అయినా సేన్‌ వినలేదు. దీనికి తోడు పలువురు విపక్ష సభ్యులు వివిధ అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తుండటంతో సభ వాయిదా పడింది.

చర్చ చేపట్టాల్సిందే: ఖర్గే

మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్యసభ నాలుగోసారి సమావేశమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే పెగాసస్‌ స్పైవేర్‌పై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో ఛైర్మన్‌ స్థానంలో ఉన్న భుబనేశ్వర్‌ కలితా మాట్లాడుతూ... ప్రభుత్వం చర్చకు అంగీకరించినందున, ఏమైనా చెప్పదలచుకుంటే అప్పుడు చెప్పాలని ఖర్గేకు సూచించారు. అయినా, విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో కలితా సభను సోమవారానికి వాయిదా వేశారు.

లోక్‌సభలోనూ అవే ప్రకంపనలు

లోక్‌సభలోనూ ‘పెగాసస్‌’ ప్రకంపనలు సృష్టించింది. తొలుత పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా, ఆయా పార్టీల ఫ్లోర్‌ లీడర్లు వారిని నిలువరించారు. ఇంతలో స్పీకర్‌ ఓం బిర్లా కలుగజేసుకుని... టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సభ్యులంతా బల్లలు చరిచారు. అనంతరం తృణమూల్‌, కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. పెగాసస్‌ స్పైవేర్‌ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని; ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చేపట్టాలని; నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ కలుగజేసుకుని... కరోనా వైరస్‌, టీకా కార్యక్రమంపై మంత్రి మాట్లాడతారని, సభ్యులు వినాలని కోరారు. అయినా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమయ్యాక వివిధ పార్లమెంటు ప్యానెళ్ల  కొత్త సభ్యుల నియామకంపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. విపక్షాల నినాదాల నడుమే సభ వాటిని ఆమోదించింది. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.

పురి-సేన్‌ల వివాదంపై దృష్టి

కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శాంతను సేన్‌ల మధ్య నెలకొన్న వివాదంపై రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు దృష్టి సారించే అవకాశముంది! సభ్యుల మధ్య చోటుచేసుకున్న విమర్శలపై మునుపటి ఛైర్మన్లు ఎవరూ ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని భావిస్తున్నానని; రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తాను పరిశీలిస్తానని వెంకయ్యనాయుడు చెప్పినట్టు విపక్ష వర్గాలు తెలిపాయి. దీన్ని ఆధారం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారని చెప్పారు.


ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి: వెంకయ్యనాయుడు

శాంతను సేన్‌... మంత్రి చేతిలోంచి పత్రాలు లాక్కొని, చించేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడేనని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘దేశానికి అపఖ్యాతి తెచ్చేలా సభ్యులు ప్రవర్తించకూడదు. పెగాసస్‌, ఇతర అంశాలను సభా వ్యవహారాల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్టు మంత్రి చెప్పినా... సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సభ ముందుకు సాగేందుకు సభ్యులు ఎందుకు సహకరించడం లేదో అర్థం కావట్లేదు. పార్లమెంటును స్తంభింపజేయడం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది?’’ అని వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. సేన్‌ను ఛైర్మన్‌ పిలిపించుకుని మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని