మధ్య తరహా.. సాగుకు భరోసా

ప్రధానాంశాలు

మధ్య తరహా.. సాగుకు భరోసా

నిండుకుండల్లా ప్రాజెక్టులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగడంతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరింది. దాదాపు ముప్పావు భాగం ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. వీటి కింద 4.48 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులు మత్తడి పోస్తున్నాయి.

* గోదావరి పరీవాహకంలో మొత్తం 28 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికింద 3.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 21 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న మెదక్‌ జిల్లాలోని ఘన్‌పూర్‌ ఆనకట్ట, 24 వేల ఎకరాలున్న ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాలతో పాటు మత్తడివాగు ప్రాజెక్టు నిండింది. 10 వేల ఎకరాలున్న కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు, నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ, సుద్దవాగు (14,000 ఎకరాలు) నిండాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పీపీరావు ప్రాజెక్టు (11,150 ఎకరాలు), పెద్దవాగు (15,000 ఎకరాలు), ఎన్టీఆర్‌ సాగర్‌ జలాలతో కళకళలాడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని నిల్వాయి (13,000 ఎకరాలు), ర్యాలి వాగు ప్రాజెక్టులు నిండాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు (13,000 ఎకరాలు) ప్రాజెక్టు నిండటంతో గేట్లు తెరిచారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గుండ్ల వాగు నిండింది. ములుగు జిల్లాలో లక్నవరం, రామప్పలకు జలకళ వచ్చింది. భద్రాద్రి జిల్లాలో 24,000 ఎకరాల ఆయకట్టు ఉన్న తాలిపేరు నిండగా కిన్నెరసానికి వరద వస్తోంది.

* కృష్ణా పరీవాహకంలో 8 మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. 1.17 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖమ్మం జిల్లాలోని వైరా ప్రాజెక్టు (17,390 ఎకరాలు), లంకా సాగర్‌ (7,350 ఎకరాలు) నిండాయి. మహబూబాద్‌ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు (7,350 ఎకరాలు) మత్తడి పోస్తోంది. వికారాబాద్‌ జిల్లా కోటిపల్లి వాగు ప్రాజెక్టు నిండింది.

మత్తడి పోస్తున్న చెరువులు
రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో తటాకాలకు ప్రవాహం వచ్చి చేరుతోంది. వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, గజ్వేల్‌ ముఖ్య ఇంజినీర్ల పరిధిలోని చెరువులు మత్తడి పోస్తున్నాయి. రాష్ట్రంలో 43,870 తటాకాలుండగా 9641 చెరువులు మత్తడి పోస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని