100 టీఎంసీలకు చేరువలో శ్రీశైలం

ప్రధానాంశాలు

100 టీఎంసీలకు చేరువలో శ్రీశైలం

జలాశయంలోకి 3.70 లక్షల క్యూసెక్కులు  
గోదావరిలో 12.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం  
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఈనాడు - హైదరాబాద్‌

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఏడాది మొదటిసారి నదిలో ప్రవాహం మూడున్నర లక్షల క్యూసెక్కులను దాటింది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నిల్వ 93.58 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి మట్టం 885 అడుగులకుగాను 855.60 అడుగుల వద్ద ఉంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లో 10 టీఎంసీల నిల్వ పెరిగింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రానికి 12 గంటల వ్యవధిలో 8.74 టీఎంసీల నిల్వ పెరిగింది. 36 గంటల్లో ఎనిమిది అడుగుల మట్టం పెరిగింది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గంట గంటకు నిల్వ సామర్థ్యం మారుతోంది. తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం నుంచి 25,427 క్యూసెక్కులు విడుదల చేస్తూ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

శ్రీశైలం జలాశయంలో నిల్వ ఆదివారం ఉదయం నాటికి 100 టీఎంసీలను మించుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల నుంచి 3.72 లక్షల క్యూసెక్కులకు వరద విడుదలవుతోంది. ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి కూడా సుమారు మూడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వస్తోంది. కర్ణాటకలో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదుల నుంచి కృష్ణా నదికి ప్రవాహం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలమట్టి, నారాయణపూర్‌లలో నీటిమట్టాన్ని ఆ రాష్ట్ర అధికారులు తగ్గించారు. ఆలమట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగాను 10.51 అడుగులు తగ్గించి 1694.49 అడుగుల వద్ద మట్టాన్ని కొనసాగిస్తున్నారు. నారాయణపూర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగాను 8.24 అడుగులు తగ్గించి 1606.76 అడుగుల వద్ద నీటిని నిల్వ చేస్తున్నారు. వచ్చిన వరదను వచ్చినట్లే జూరాల వైపు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలో 1045 అడుగుల పూర్తిస్థాయి మట్టానికిగాను 5.83 అడుగులు తగ్గించి 1039.17 అడుగుల వద్ద నిల్వ ఉంచి వరదను వదులుతున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు గోదావరి ఉగ్రరూపం సంతరించుకుంది. సాయంత్రం సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

రామాలయానికి చెందిన అన్నదాన సత్రం ముందు వరదనీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గోదావరి స్నానఘట్టాలు చాలావరకు మునిగిపోవడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. పలు కాలనీల వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరి ఎగువ ప్రాంతంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ప్రవాహం తగ్గింది. 75 వేల క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. కడెం, స్థానిక ప్రవాహం కలిపి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీ ప్రవాహం రాగా మధ్యాహ్నం వరకు 3.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. సాయంత్రానికి ప్రవాహం తగ్గిపోవడంతో 1.01 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రాణహిత, మానేరు నదుల సంగమం అనంతరం లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీ వద్ద మాత్రం 11.61 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క సాగర్‌ (తుపాకుల గూడెం) బ్యారేజీ వద్ద 12.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఉదయం పూట ఇక్కడ 13.80 లక్షల క్యూసెక్కులు నమోదైంది.

ముంపు ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం

భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని జిల్లాలకు చెందిన పోలీసులు ఎక్కడికక్కడే సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. వాగులు పోటెత్తుతుండటంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈనేపథ్యంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లోని పోలీస్‌ బృందాలు ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. వరద ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని సూచించాయి. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100 సేవల్ని వినియోగించుకోవాలని లోతట్టు గ్రామాల ప్రజల్ని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లకు సందర్శకులను అనుమతించడం లేదు. పలువురు ఉన్నతాధికారులు నదీ పరీవాహక, లోతట్టు ప్రాంతాల్లోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


ఉగ్ర గోదావరి.. హెచ్చరికల లెక్క ఇది

గోదావరి భారీ ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. సముద్ర మట్టంతో భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహ మట్టం పోల్చి లెక్కిస్తారు. నదిలో ప్రవాహ సామర్థ్యం పెరిగే కొద్దీ ఇరువైపులా వరద వ్యాపిస్తుంది. ఈ మట్టం 37 నుంచి 40 అడుగుల స్థాయికి చేరితే నదీ పరివాహక ప్రాంతాల్లో ముంపు ప్రారంభమవుతుంది. 43 అడుగులకు చేరిందంటే ముంపు పెరుగుతుందని అర్థం. అప్పుడు ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంది. 48 అడుగులకు చేరితే రెండో హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరితే భద్రాచలం నుంచి ఎగువ భాగంలో 130 కిలోమీటర్ల వరకు ముంపు ప్రభావం ఉంటుంది. గోదావరిలో కలిసే ఉపనదులు పోటెత్తుతాయి. ఇప్పటివరకు 1986 ఆగస్టులో నమోదైన 75.6 అడుగుల స్థాయిదే రికార్డుగా ఉంది.

* 2013 నుంచి మూడుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 2013లో 61.6, 2014లో 56.1, 2020లో 61.6 అడుగుల నీటి మట్టం నమోదైంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని