పోక్సో ఫిర్యాదులపై తక్షణ స్పందన

ప్రధానాంశాలు

పోక్సో ఫిర్యాదులపై తక్షణ స్పందన

సైదాబాద్‌ ఉదంతం నేపథ్యంలో పోలీసుశాఖ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య ఉదంతం పోలీసుశాఖలో కదలిక తీసుకొచ్చింది. బాలలపై లైంగిక దాడుల కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న పోక్సో కేసుల పరిష్కారంపైనా దృష్టిసారించారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌ సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించగా.. నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేరం జరగడం ఒక ఎత్తయితే వారం రోజుల పాటు నిందితుడి ఆచూకీని గుర్తించలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. అడుగడుగునా మోహరించిన పోలీసులను, వేలాది సీసీ కెమెరాలను తప్పించుకుని రాజు హైదరాబాద్‌ నుంచి పారిపోవడమూ చర్చనీయాంశమైంది. నిందితుడిని పట్టుకోవడం ఆలస్యమవుతున్న కొద్దీ పోలీసుశాఖపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. దాదాపు 2 వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపినా ప్రయోజనం కలగలేదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ పలు కారణాలతో గాలింపు ఆశించినస్థాయిలో జరగలేదు. సిబ్బంది అంతా గణేశ్‌ బందోబస్తులో ఉండటం కూడా దర్యాప్తునకు ఆటంకాలు కలిగించింది. కారణాలేవైనా పోలీసుశాఖ వైఫల్యం కనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాలలపై లైంగిక దాడులకు సంబంధించి ఫిర్యాదు రాగానే నిందితులను పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలని, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.

పెండింగ్‌లో ఉన్న పోక్సో కేసుల దర్యాప్తును సత్వరమే పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులు ఆదేశించారు. 2020 నుంచి ఇప్పటివరకూ దాదాపు రెండు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలు, కమిషనరేట్ల వారీగా వీటి దర్యాప్తును పర్యవేక్షించాలని అధికారులు స్పష్టంచేశారు. ముఖ్యంగా బాలలపై నేరాలు, పోక్సో చట్టంపై మహిళా శిశు సంక్షేమశాఖతో కలిసి ప్రజలు, చిన్నారుల్లో చైతన్యం కల్పించాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని