ప్రతి పౌరుడికీ ఆరోగ్య గుర్తింపు కార్డు

ప్రధానాంశాలు

ప్రతి పౌరుడికీ ఆరోగ్య గుర్తింపు కార్డు

రికార్డులన్నీ డిజిటల్‌ రూపంలో
ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ప్రారంభం
ఇది విప్లవాత్మక మార్పులు తేనుందని మోదీ ఉద్ఘాటన

దిల్లీ: భారత్‌ వైద్య, ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ విప్లవాత్మక మార్పులు తేనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికీ డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డు(ఐడీ)ను అందివ్వనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి పౌరులు తమ ఆరోగ్య రికార్డులను భౌతిక రూపంలో భద్రపరచుకోనక్కర్లేదని, ఈ కార్డులోనే డిజిటల్‌ రూపంలో సురక్షితంగా ఉంటాయని వెల్లడించారు. దేశంలో ఏ ప్రాంతంలో నివసించే పౌరులైనా అత్యుత్తమ వైద్యసేవలు అందుకొనే అవకాశం ఈ కార్డుతో లభించనుందని పేర్కొన్నారు. దేశ ఆరోగ్యరంగ ముఖ చిత్రాన్ని.. ఈ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) మార్చనుందని ప్రధాని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న ఈ మిషన్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రం అమలు చేసింది. దీన్ని సోమవారం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ‘‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌.. దేశంలోని ఆస్పత్రులను, వైద్య, ఆరోగ్య సదుపాయాలను  అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా దేశవాసులకు ఒక డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డు లభించనుంది. ఇందులో ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులు డిజిటల్‌ రూపంలో సురక్షితంగా ఉంటాయి. ఈ మాధ్యమం ద్వారా రోగి, వైద్యుడు కూడా పాత వైద్య చరిత్రను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితో పాటు.. ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, ఆరోగ్య కేంద్రాలు కూడా ఇందులో నమోదై ఉంటాయి’’ అని మోదీ తెలిపారు. ఈ కార్డుతో దిగువ మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు.

పెద్ద దేశాలకే సాధ్యం కాలేదు
డిజిటల్‌ సాంకేతికను భారత్‌ చాలా మెరుగ్గా ఉపయోగించుకుంటోందని.. ఇది పెద్ద పెద్ద దేశాలకే సాధ్యం కాలేదని ప్రధాని చెప్పారు. కరోనా సంక్రమణను ఆరోగ్య సేతు యాప్‌ అద్భుతంగా నిరోధించిందని, కొవిన్‌ యాప్‌ సాయంతో దేశంలో 90 కోట్ల టీకాలను దిగ్విజయంగా వేయగలిగామని తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనతో దేశంలో దాదాపు రెండు కోట్ల మంది ఉచితంగా వైద్యసేవలు పొందారని.. ఇది తనకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు. భారత్‌లో 130 కోట్ల ఆధార్‌ కార్డు, 118 కోట్ల మొబైల్‌, 43 కోట్ల జన్‌ధన్‌ బ్యాంక్‌ వినియోగదారులు ఉన్నారని.. ఇంతటి అనుసంధాన వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదని చెప్పారు. ఆరోగ్య రంగానికి పర్యాటకంతో ఉన్న సంబంధాలు గురించి కూడా ప్రధాని మాట్లాడారు. మెరుగైన వైద్య సదుపాయాలున్న దేశాల్లో పర్యటించడానికే పర్యాటకులు ఉత్సాహం చూపుతారని వివరించారు. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా సురక్షితంగా ఉంటామన్న భావనే దీనికి కారణమని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది మరింత పెరిగిందని చెప్పారు. డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ విధానం ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిందో, ఈ ఆరోగ్య గుర్తింపు కార్డు కూడా అలాంటి మార్పులే తేనుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక క్లిక్‌తో పౌరులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని